Let's talk: editor@tmv.in
టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్

టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్

Shaik Mohammad Shaffee
9 మార్చి, 2026

భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. నాడు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇదే నరేంద్ర మోడీ స్టేడియంలో ఎదురైన పరాజయ పరాభవాన్ని భారత్ తుడిచేసింది. ఆదివారం జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో టీమిండియా విశ్వరూపం ప్రదర్శించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, భారత్ మూడోసారి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌ను ముద్దాడింది. తద్వారా వరుసగా రెండుసార్లు టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా, సొంత గడ్డపై కప్పు గెలిచిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

బ్యాటర్ల ఊచకోత.. రికార్డుల మోత

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, కివీస్ బౌలర్లను ఉతికి ఆరేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆరంభం నుంచే వీరవిహారం చేశారు. పవర్‌ప్లేలో ఏకంగా 92 పరుగులు రాబట్టి ప్రపంచ రికార్డును సమం చేశారు. కేవలం 18 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అభిషేక్ శర్మ (52) టోర్నీలోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించగా, సంజూ శాంసన్ (89; 45 బంతుల్లో, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ అర్ధ సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్‌గా సంజూ రికార్డుకెక్కాడు. ఇషాన్ కిషన్ (54) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, ఆఖర్లో శివమ్ దూబే (24) ధాటిగా ఆడటంతో భారత్ 250 మార్కును దాటింది.

కివీస్ బౌలర్ల బేజారు.. భారత్ బౌండరీల హోరు

న్యూజిలాండ్ బౌలర్ల వ్యూహం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా లాకీ ఫెర్గూసన్ వేసిన 2 ఓవర్లలోనే భారత బ్యాటర్లు 48 పరుగులు పిండుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో మొత్తం 19 ఫోర్లు, 18 సిక్సర్లు నమోదయ్యాయి అంటే బ్యాటర్ల జోరు ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్లో శాంసన్, కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లను అవుట్ చేసి భారత్‌ను కాస్త కట్టడి చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కివీస్ ఫీల్డర్ల తప్పిదాలు, ధారాళంగా ఇచ్చిన వైడ్లు కూడా భారత్‌కు కలిసివచ్చాయి.

బుమ్రా, అక్షర్ పంజా.. కుప్పకూలిన బ్లాక్ క్యాప్స్

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభంలోనే ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లను కోల్పోయి కివీస్ కోలుకోలేని దెబ్బతింది. లోకల్ బాయ్ అక్షర్ పటేల్ (3/27) తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కట్టడి చేయగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (4/15) కివీస్ పతనాన్ని శాసించాడు . టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (52) మాత్రమే పోరాడగా, మిగిలిన వారు చేతులెత్తేశారు. దీంతో 19 ఓవర్లలో 159 పరుగులకే న్యూజిలాండ్ కుప్పకూలింది. ఈ ఓటమితో గత 11 ఏళ్లలో ఐదుసార్లు ఐసీసీ ఫైనల్స్ చేరిన కివీస్, మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

విజయకేతనం ఎగురవేసిన భారత్

ఈ టోర్నీలో ఆడిన చివరి 16 మ్యాచ్‌ల్లో 15 గెలిచిన భారత్, తన అప్రతిహత విజయయాత్రను టైటిల్‌తో ముగించింది. వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌లో తీసిన వికెట్‌తో మొత్తం 14 వికెట్లతో టోర్నీలో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసిన భారత్, 2024 తర్వాత మరోసారి పొట్టి ప్రపంచకప్‌ను తన ఖాతాలో వేసుకుని క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.