
టీ20 ప్రపంచకప్: నమీబియాపై భారత్ ఘనవిజయం
స్థానిక అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగిన టీ20 ప్రపంచకప్ పోరులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య మెరుపులు మెరిపించగా.. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలం చేయడంతో నమీబియాపై భారత్ 93 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం నమీబియాను 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూల్చింది. ఈ విజయంతో భారత్ రెండు మ్యాచ్‌లలో రెండు గెలిచి గ్రూప్-ఏ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇషాన్ కిషన్ సునామీ ఇన్నింగ్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే సంజు శాంసన్ (22) రూపంలో వికెట్ పడినా, ఇషాన్ కిషన్ మైదానంలో పరుగుల వరద పారించాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో కిషన్ ఏకంగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు రాబట్టాడు. కేవలం 20 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసిన ఇషాన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారత్ కేవలం 6.5 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును చేరి టీ20 ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన టీమ్ సెంచరీని నమోదు చేసింది.
పాండ్య మెరుపులు.. ఎరాస్మస్ 4 వికెట్లు
మధ్యలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12), తిలక్ వర్మ (25) త్వరగానే అవుటైనా, హార్దిక్ పాండ్య (28 బంతుల్లో 52; 8 ఫోర్లు), శివమ్ దూబే (23) జంట జట్టు స్కోరును 200 దాటించారు. అయితే నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ (4/20) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీయడంతో భారత్ చివరికి 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
వరుణ్ చక్రవర్తి స్పిన్ మ్యాజిక్
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియాకు ఓపెనర్లు స్టీన్‌క్యాంప్ (29), ఫ్రైలింక్ (22) శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లే ముగిసేసరికి నమీబియా 57/1తో బలంగా కనిపించింది. కానీ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/7) బంతిని అందుకోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఒకే ఓవర్లో ఈటన్, స్మిత్‌లను అవుట్ చేసి నమీబియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. అక్షర్ పటేల్ (2/20), హార్దిక్ పాండ్య (2/21) కూడా తోడవడంతో నమీబియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
బుమ్రా వేసిన మెరుపు యార్కర్‌కు ట్రంపెల్‌మాన్ క్లీన్ బౌల్డ్ కాగా, చివరి వికెట్‌ను శివమ్ దూబే పడగొట్టాడు. దీంతో నమీబియా ఇన్నింగ్స్ 116 పరుగుల వద్ద ముగిసింది. అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ఇప్పుడు పాకిస్థాన్‌తో సమానమైన రన్ రేట్‌తో గ్రూపులో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్:
209/9 (ఇషాన్ కిషన్ 61, హార్దిక్ పాండ్య 52; గెరార్డ్ ఎరాస్మస్ 4/20)
నమీబియా:
116 (18.2 ఓవర్లలో) (స్టీన్‌క్యాంప్ 29, ఫ్రైలింక్ 22; వరుణ్ చక్రవర్తి 3/7, అక్షర్ పటేల్ 2/20)
నేపాల్ చిత్తు.. బోణీ కొట్టిన ఇటలీ
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో అరంగేట్రం జట్టు ఇటలీ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసి ఐసీసీ టోర్నీలో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్‌ను ఇటలీ బౌలర్లు కలుగమగే (3/18), బెన్ మానేంటి (2/9) ధాటికి 123 పరుగులకే కుప్పకూల్చారు. నేపాల్ బ్యాటర్లలో ఆసిఫ్ షేక్ (27), ఆరిఫ్ షేక్ (27) మాత్రమే రాణించగా, ఆఖర్లో కేవలం తొమ్మిది పరుగుల వ్యవధిలోనే నేపాల్ 5 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీకి ఓపెనర్లు, సోదరులైన జస్టిన్ మోస్కా (50 నాటౌట్), ఆంథోనీ మోస్కా (50 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ అర్థసెంచరీలతో మెరిశారు. నేపాల్ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 12.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించారు. పవర్ ప్లేలోనే 68 పరుగులు రాబట్టిన ఇటలీ సోదరులు, నేపాల్ బౌలింగ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రపంచకప్ చరిత్రలో తమ దేశానికి మరపురాని విజయాన్ని అందించారు.
ఒమన్‌పై శ్రీలంక భారీ విక్టరీ
మరోవైపు పల్లెకెలె వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల భారీ తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కెప్టెన్ దసున్ శనక (19 బంతుల్లో 50) రికార్డు స్థాయి మెరుపు అర్థసెంచరీతో పాటు కుశాల్ మెండిస్ (61), పవన్ రత్నాయకే (60) ధాటికి 20 ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక తరఫున అత్యంత వేగవంతమైన అర్థసెంచరీ సాధించిన ఆటగాడిగా శనక రికార్డు సృష్టించగా, ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్‌ను లంక బౌలర్లు చమీర (2/19), తీక్షణ (2/11) వణికించారు. ఒమన్ బ్యాటర్లలో మహమ్మద్ నదీమ్ (53) ఒంటరి పోరాటం చేసినా, మిగిలిన వారు విఫలం కావడంతో ఆ జట్టు 120 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో శ్రీలంక పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, తన నెట్ రన్ రేట్‌ను (+3.125) భారీగా మెరుగుపరుచుకుని సూపర్-8 దిశగా అడుగులు వేసింది.
