
టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం.. పాక్ ఆటగాళ్లకు పీసీబీ భారీ జరిమానా!
టీ20 ప్రపంచకప్ 2026లో ఘోర పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. టోర్నీ ఆద్యంతం అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచినందుకు గానూ.. జట్టులోని ప్రతి ఆటగాడికి 5 మిలియన్ల పాకిస్థానీ రూపాయల (సుమారు 18,000 అమెరికన్ డాలర్లు) భారీ జరిమానా విధిస్తూ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ టోర్నీల్లో వరుసగా నాలుగోసారి సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమవ్వడం పాక్ క్రికెట్ చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో, జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బోర్డు ఈ విధమైన శిక్షాత్మక చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
భారత్‌తో ఓటమే కొంపముంచింది..
నిజానికి ఈ జరిమానా నిర్ణయం గ్రూప్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్ తర్వాతే ఖరారైనట్లు తెలుస్తోంది. టీమిండియాతో జరిగిన కీలక పోరులో పాక్ జట్టు 61 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణించింది. క్రమశిక్షణారాహిత్యం వల్ల కాకుండా, కేవలం ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కారణంగానే ఈ జరిమానా విధించినట్లు ఇఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో పేర్కొంది. ఒకవేళ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుని ఉంటే ఈ జరిమానాను రద్దు చేస్తామని బోర్డు ముందుగానే వెల్లడించినప్పటికీ, పాక్ జట్టు ఆ అవకాశాన్ని చేజార్చుకుంది.
సమీకరణాలు కలిసిరాక.. సెమీస్ చేరలేక..
ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ ప్రయాణం ఆరంభం నుంచే ఒడిదుడుకులతో సాగింది. న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మరోవైపు శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించడంతో పాక్ సెమీస్ అవకాశాలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉండే పరిస్థితిలో, పాక్ జట్టు అతి కష్టం మీద స్వల్ప తేడాతో మాత్రమే విజయం సాధించింది. ఫలితంగా రన్ రేట్ తక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
ఎన్వోసీల రద్దు
పెద్ద టోర్నీల్లో వైఫల్యాలు ఎదురైన ప్రతిసారీ పీసీబీ యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తోంది. గత ఏడాది ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత కూడా పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ సయ్యద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశీ టీ20 లీగ్స్‌లో ఆడేందుకు ఆటగాళ్లకు ఇచ్చే నిరభ్యంతర పత్రాలను ( ఎన్వోసీలు ) సెప్టెంబర్ 29 నుంచి నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ప్రపంచకప్ ఓటమితో ఆటగాళ్ల జేబులకు చిల్లు పడటంతో పాక్ క్రికెటర్లు తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయారు.
