Let's talk: editor@tmv.in
టీ20ల్లో భారత్ బలమైన జట్టే: కపిల్‌దేవ్

టీ20ల్లో భారత్ బలమైన జట్టే: కపిల్‌దేవ్

Pinjari Chand
1 ఫిబ్రవరి, 2026

రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుంటే భారత జట్టు ఇప్పటికీ అత్యంత బలమైన పోటీదారుల్లో ఒకటని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. అయితే క్రికెట్ మూలస్తంభం అయిన టెస్ట్ క్రికెట్‌కు ఎప్పటికీ ప్రాధాన్యం తగ్గకూడదని ఆయన స్పష్టం చేశారు. టీ20 ఫార్మాట్‌కు ఆదరణ పెరిగినప్పటికీ, దీర్ఘకాలిక ఫార్మాట్‌లను నిర్లక్ష్యం చేయడం సరికాదని కపిల్ అన్నారు. టీ20 క్రికెట్‌లో సందేహం లేదు… మన జట్టు అత్యుత్తమ జట్లలో ఒకటి. కానీ ఒక్క రోజు చెడు రోజు రావచ్చు. క్రికెట్ గురించి మాట్లాడితే తప్పనిసరిగా టెస్ట్ క్రికెట్ గురించే మాట్లాడాలని 1983 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ పేర్కొన్నారు.

వన్డే క్రికెట్ కూడా నిర్లక్ష్యం చేయరాదని ఆయన అన్నారు. టీ20 ఉత్కంఠభరితమైన ఫార్మాట్ అన్నది నిజమే. కానీ క్రికెట్‌కు పునాది టెస్ట్ క్రికెట్. దానితో పాటు వన్డే క్రికెట్‌కూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రెండు ఫార్మాట్‌లలో మరింత సమయం పెట్టుబడి పెట్టాలని తెలిపారు. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్–పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్ నిర్వహణపై ప్రశ్నించగా, అలాంటి నిర్ణయాలు తన లాంటి మాజీ ఆటగాళ్లు తీసుకోవాల్సినవి కాదని స్పష్టం చేశారు.

ఇలాంటి అంశాలపై నేను వ్యాఖ్యలు చేయడం న్యాయం కాదు. అది ప్రభుత్వ నిర్ణయం లేదా క్రికెట్ బోర్డు నిర్ణయం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా, నేను నా దేశం పక్షానే నిలబడతాను. అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు చేయడం నాకు ఇష్టం లేదు. సరిహద్దు అవతల కొందరు క్రికెటర్లు అలా చేస్తుంటారు, కానీ నేను చేయను అని ఆయన అన్నారు.

ఇటీవల న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ల్లో భారత్ ఎదుర్కొన్న పరాజయాల నేపథ్యంలో వేర్వేరు ఫార్మాట్‌లకు వేర్వేరు కోచ్‌లు అవసరమా? అన్న ప్రశ్నకు కూడా కపిల్ స్పందించారు. ఇలాంటి విషయాల్లో మాజీ ఆటగాళ్లు అభిప్రాయం చెప్పడం తగదు. టెస్ట్, వన్డే, టీ20 — ఏ ఫార్మాట్‌కు ఎలాంటి కోచింగ్ అవసరమో నిర్ణయించడం బోర్డు బాధ్యత. థింక్‌ ట్యాంక్‌దే ఆ పని అని అన్నారు. ముగ్గురు కోచ్‌లు అవసరమైతే ముగ్గురిని నియమించాలి. ఇద్దరు సరిపోతే ఇద్దరిని. ఒక కోచ్‌తోనే పని సాగితే అదీ సరే. అన్నీ బోర్డు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని కపిల్ దేవ్ స్పష్టం చేశారు.