Let's talk: editor@tmv.in
టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్‌

టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్‌

Shaik Mohammad Shaffee
29 సెప్టెంబర్, 2025

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నేపాల్ జట్టు సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏకఛత్రాధిపత్యంగా శాసించిన వెస్టిండీస్‌ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో 19 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పూర్తిస్థాయి సభ్యదేశంపై నేపాల్ టీ20 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌డం ఇదే తొలిసారి. ఈ అనూహ్య విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేపాల్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

నిలకడగా రాణించిన నేపాల్ మిడిల్ ఆర్డర్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు తమ ఇద్దరు ఓపెనర్లను త్వరగా కోల్పోయినప్పటికీ, కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35 బంతుల్లో 38 పరుగులు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అతడితో జత కలిసిన కుశాల్ మల్లా దూకుడుగా ఆడి ఇన్నింగ్స్ వేగాన్ని పెంచాడు. ఫాబియన్ అలెన్, ఒబెద్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో మల్లా కొట్టిన సిక్సర్లు ఆటతీరును మార్చాయి. పౌడెల్, మల్లా కలిసి కీలకమైన 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖర్లో జాసన్ హోల్డర్ 19వ ఓవర్‌లో మూడు వికెట్లు తీసినప్పటికీ, నేపాల్ పోరాడదగిన 148/8 స్కోరును నమోదు చేసింది. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4 వికెట్లు, నవీన్ బిదైసీ 3 వికెట్లు తీశారు.

వెస్టిండీస్ తడబాటు

అనంతరం 149 పరుగుల లక్ష్యంతో వెస్టిండీస్ జట్టు బరిలోకి దిగింది. కైల్ మేయర్స్ బౌండరీతో ఆరంభించినప్పటికీ, ఆ తర్వాత త్వరగానే వారి ఇన్నింగ్స్ పట్టు తప్పింది. ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లు నిలకడగా రాణించలేకపోయారు. నవీన్ బిదైసీ (22), అమీర్ జంగూ (19) మాత్రమే పర్వాలేదనిపించారు. చివర్లో ఫాబియన్ అలెన్ (19), కెప్టెన్ అకీల్ హొసేన్ (18) పోరాడినప్పటికీ వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేపాల్ బౌలర్లలో కుశాల్ భుర్తేల్ 2, దీపేంద్ర సింగ్ ఐరీ, కరణ్ కేసీ, నందన్ యాదవ్, లలిత్ రాజ్‌బన్షి, రోహిత్ పౌడెల్‌లు చెరో ఒక వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించిన నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్‌ - Tholi Paluku