
టీ పొడి కల్తీ రాకెట్ గుట్టు రట్టు - సనత్‌నగర్‌లో టాస్క్ ఫోర్స్ దాడులు
హైదరాబాద్ నగరంలో మరోసారి ఆహార కల్తీ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ అధికారులు సనత్‌నగర్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో టీ పొడి కల్తీ రాకెట్‌ను గుట్టు రట్టు చేశారు. నమ్మకమైన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం, సనత్‌నగర్ పోలీసులతో కలిసి చేపట్టిన ఈ దాడుల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడిన నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్ (33) టీ వ్యాపారం చేస్తున్నాడు. అక్రమ లాభాల కోసమే టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు విచారణలో అతడు అంగీకరించాడు. కోకోపీట్‌ను బెల్లం నీటిలో కలిపి ఎండబెట్టి, ఆపై సింథటిక్ ఆహార రంగులు కలిపి టీ పొడిలా మార్చే ప్రక్రియను అతడు అనుసరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒక కిలో కల్తీ టీ పొడి తయారీకి తక్కువ నాణ్యత గల టీ డస్ట్, టీ గ్రాన్యూల్స్‌తో పాటు రంగులు కలిపిన కోకోపీట్‌ను మిశ్రమంగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. సన్‌సెట్ యెల్లో, టార్ట్రజిన్ వంటి సింథటిక్ రంగులను వాడటం వల్ల టీ పొడి సహజ రంగులో కనిపించేలా చేసి, అసలైన టీ పొడిగా మోసం చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఒక కిలో కల్తీ టీ పొడి తయారీకి, తక్కువ నాణ్యత గల టీ డస్ట్-450 గ్రాములు, తక్కువ నాణ్యత గల టీ గ్రాన్యూల్స్-500 గ్రాములు, రంగులు కలిపిన కోకోపీట్-50 గ్రాములు తీసుకుని వీటన్నింటిని కలిపి తయారు చేసిన కల్తీ టీ పొడిని, అసలైన టీ పొడిగా చెప్పి స్థానిక టీ స్టాళ్లు మరియు ఇతర డీలర్లకు అధిక ధరకు విక్రయించేవాడని తెలిపాడు.
ఈ విధంగా తయారైన కల్తీ టీ పొడిని స్థానిక టీ స్టాళ్లు, డీలర్లకు అధిక ధరలకు సరఫరా చేస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. ఈ వ్యవహారం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దాడుల్లో భారీగా 120 కిలోల కల్తీ టీ పొడి, సహజ టీ పొడి 30 కిలోలు, కోకోపీట్ మిశ్రమం 138 కిలోలు, ఆహార రంగులు, తూకం యంత్రం, బెల్లం తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. యాదేందర్, ఎస్‌ఐ డి. రవిరాజ్ నేతృత్వంలో నిర్వహించారు. ప్రజలు తప్పనిసరిగా అధికృత, విశ్వసనీయ విక్రేతల నుంచే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని పోలీసులు సూచించారు. ఆహార కల్తీకి పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
