
టీస్క్వేర్‌ను తెలంగాణ ఐకాన్‌గా తీర్చిదిద్దాలి: సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నగరంలో ప్రతిపాదిత ‘టీ స్క్వేర్’కు ప్రత్యేకమైన డిజైన్‌లను పరిగణించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే న్యూయార్క్ ‘టైమ్స్ స్క్వేర్’ నమూనాలో ‘టీ స్క్వేర్’ను అభివృద్ధి చేయాలని ప్రకటించిందన్నారు. వ్యాపారం, వినోదం, పర్యాటకం వ్యాపార కార్యకలాపాలకు వేదికగా ఉండేలా, అదే సమయంలో కార్పొరేట్ అవసరాలకు కూడా అనుకూలంగా డిజైన్ చేయాలని సూచించారు. సందర్శకులకు ఆకర్షణీయమైన కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ‘టీ స్క్వేర్’లో యాపిల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రాయదుర్గం సమీపంలో చేపట్టనున్న టీస్వ్కేర్ నిర్మాణ పనులను నవంబర్ నెలాఖరుకు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా, ప్రతిపాదిత టీ స్క్వేర్‌లో ‘యుటిలిటీ జోన్’ను ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతం 24 గంటలు కార్యకలాపాలతో ఉత్సాహంగా నడుస్తూ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాక, ప్రతిపాదిత ‘ఏఐ హబ్’ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, ప్రపంచ ప్రసిద్ధ సంస్థల ప్రతినిధులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసి దానిని పర్యవేక్షించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
ఏఐ ఇన్నోవేషన్ హబ్
ముఖ్యమంత్రి నగరంలో ఏఐ ఇన్నోవేషన్ హబ్‌ను స్థాపించే ప్రణాళికలను కూడా సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని ఏఐ ఇనిషియేటివ్‌లు, స్టార్టప్‌లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, గ్లోబల్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ ఏఐ హబ్‌లతో భాగస్వామ్యం కల్పించే ఉద్దేశ్యంగా ఉందన్నారు. 2024 నుంచి తెలంగాణ ప్రభుత్వం అనేక ఏఐ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. గ్లోబల్ ఏఐ సమ్మిట్ (సెప్టెంబర్ 2024),ఏఐ సిటీ ప్రాజెక్ట్ ప్లాన్, తెలంగాణ ఏఐ రైజింగ్ గ్రాండ్ చాలెంజ్, అదనంగా, దేశంలోనే మొదటి రాష్ట్ర స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయిన తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్రారంభమైందన్నారు. ఏఐ నైపుణ్య అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాంశంగా ఉందని. విద్యార్థులు, ఉద్యోగుల్లో ఏఐ నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రత్యేక ఏఐ విశ్వవిద్యాలయం స్థాపనపై కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
