Let's talk: editor@tmv.in
టీవీ శబ్దం తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

టీవీ శబ్దం తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

Panthagani Anusha
21 ఫిబ్రవరి, 2026

టీవీ వాల్యూమ్ విషయంలో మొదలైన చిన్నపాటి గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాదకర ఘటన మంగళగిరి పరిధిలో చోటుచేసుకుంది. టీవీ శబ్దం తగ్గించమన్నందుకు ఆగ్రహానికి లోనైన భార్య, భర్తను కత్తితో పొడిచి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

స్థానిక పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో నివాసముంటున్న షేక్ అహ్మద్ (27)కు క్రాంతి (25) అనే యువతితో ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. గురువారం సాయంత్రం ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో శబ్దం ఎక్కువగా ఉండటంతో, అహ్మద్ తన భార్యను వాల్యూమ్ తగ్గించాలని కోరాడు. ఈ చిన్న విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన క్రాంతి ఇంట్లోని కత్తితో అహ్మద్‌పై ఒక్కసారిగా పొడిచింది.

కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో కుప్పకూలిన అహ్మద్‌ను గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే స్పందించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అహ్మద్ ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది నెలల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కుమారుడు ఇలా కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇక మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. టీవీ శబ్దం తగ్గించమన్నందుకే తన కోడలు కుమారుడిని పొడిచి చంపిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు మంగళగిరి సబ్‌డివిజనల్ పోలీస్ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. కాగా నిందితురాలు క్రాంతిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామని ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.