Let's talk: editor@tmv.in
టీవీ అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి: మంత్రి కోమటిరెడ్డి

టీవీ అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి: మంత్రి కోమటిరెడ్డి

Gaddamidi Naveen
29 జులై, 2026

రాష్ట్రంలో తొలిసారిగా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న టెలివిజన్ (టీవీ) అవార్డుల మార్గదర్శకాలు, లోగో, ఎంపిక విధానంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఎండీ ముకుంద రెడ్డి, అవార్డుల కమిటీ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెలివిజన్ రంగం ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు విశేష వినోదాన్ని అందిస్తోందన్నారు. ఈ రంగంలో ప్రతిభ కనబరుస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, సామాజిక సందేశాత్మక సీరియళ్లు, బాలల చిత్రాలను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ ఆత్మ, సంస్కృతి, ప్రత్యేకత ప్రతిబింబించేలా అవార్డుల పేరు, లోగో ఉండాలని స్పష్టం చేశారు.

కమిటీ ప్రతిపాదించిన విధంగా ఈ అవార్డులకు బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని మంత్రి వెల్లడించారు. అవార్డుల నిబంధనలు, లోగోలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో తొలిసారిగా ఇస్తున్న ఈ టీవీ అవార్డుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలని కమిటీకి సూచించారు. అవార్డుల ప్రదానోత్సవ వేదికల ఎంపికపై ఎఫ్‌డీసీ ఎండీ ముకుంద రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అన్ని ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

ట్యాగ్‌లు
TelanganaTVAwardsTelanganaGovernmentKomatireddyVenkatReddyTeluguTVTeluguSerialsTelevisionAwardsTelanganaCulturePVNarasimhaRao
టీవీ అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి: మంత్రి కోమటిరెడ్డి - Tholi Paluku