
టీవీకే పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది.. డీఎంకేను ఓడించగలిగేది మేమే: విజయ్
ప్రజల మద్దతుతో తమిళ వెట్రి కజగం (టీవీకే) ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను ఓడించగలిగేది తమ పార్టీ ఒక్కటేనని టీవీకే వ్యవస్థాపకుడు, నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మూడో వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా చెన్నైలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలు త్రి ముఖ, లేదా బహుముఖ పోటీగా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవంగా పోటీ మాత్రం టీవీకే–డీఎంకే మధ్యే జరుగుతుందన్నారు. ఈ పోరులో చివరకు డీఎంకే ఓటమి తప్పదని విజయ్ స్పష్టం చేశారు.
ప్రజలు ముక్కోణపు పోటీ, నాలుగు పార్టీల మధ్య పోటీ అంటూ మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ఒక వైపు ప్రజల మద్దతు ఉన్న టీవీకే, మరోవైపు డీఎంకే. మూడో వైపు బీజేపీ, దాని మిత్రపక్షాలు ఉన్నాయి. డీఎంకేను ఓడించగలిగే ప్రజల శక్తి ఒక్కటే ఉంది. అది టీవీకే మాత్రమే అని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు, ప్రజలే నా బలం. మీ వల్లే ఈ రోజు టీవీకే ఒక పెద్ద పార్టీగా ఎదిగింది. నేనూ, పార్టీ కూడా పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉందని చెప్పారు.
డీఎంకేను ‘ప్లాటినం జూబ్లీ బేబీ’గా అభివర్ణిస్తూ, ఆ పార్టీకి వ్యతిరేకంగా నిలబడే ధైర్యం తమ పార్టీకి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. డీఎంకే పార్టీ స్థాపనకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, దివంగత ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జీ.రామచంద్రన్ సాధించిన విజయ గాథను తాను తిరిగి రాస్తానని విజయ్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు టీవీకే తప్ప మరే ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు.
వారికి నిద్రలో కూడా విజిలే గుర్తుకు వస్తోంది
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తన మంత్రులు ఏమి మాట్లాడతారోనని నిద్ర పట్టడం లేదని స్టాలిన్ అన్నారు. ఆయనను నిద్రలేపి ‘ఎవరికి ఓటు వేస్తారు?’ అని అడిగితే, ‘విజిల్ గుర్తుకు’ (టీవీకే ఎన్నికల గుర్తు) అని చెబుతారు. నిద్రలో నుంచి లేపినప్పుడు నిజం బయటకు వస్తుందని విజయ్ వ్యాఖ్యానించారు. తాను ప్రజలను కలవడం లేదని, మీడియా ముందుకు రావడం లేదని తనపై విమర్శలు చేస్తున్నవారికి బదులిస్తూ ‘విజయ్ బయటకు రా’ అని చెప్పేవారికి నా సమాధానం ఒక్కటే. ప్రతి ఇంట్లో ఒక విజయ్, ఒక విజి ఉన్నారు. వారు ఓటింగ్ రోజు తమ ఓటర్ ఐడీతో బయటకు వచ్చి పోలింగ్ బూత్ వద్ద నిలబడతారు. అప్పుడు మీకు అర్థమవుతుందని అన్నారు.పార్టీ కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
టీవీకే ఎన్నికల గుర్తు ‘విజిల్’ గురించి మాట్లాడుతూ మేమే తమిళనాడు రాజకీయాల్లో విజిల్‌బ్లోయర్లు. మేము గట్టిగా విజిల్ ఊదితే అవినీతి, చెడు శక్తులు చెల్లాచెదురవ్వాలి. అప్పుడు టీవీకే పాలక పార్టీగా అవతరిస్తుంది. నేను మీతో ఉన్నాను, ప్రజలు మనతో ఉన్నారు. ధైర్యంగా ఉండండి, విజయం మనదే అని విజయ్ అన్నారు.
