
టీవీకే పార్టీకి ‘విజిల్’ గుర్తు కేటాయింపు
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటులు విజయ్, కమల్ హాసన్ నేతృత్వంలోని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారికంగా ఎన్నికల గుర్తులను కేటాయించింది. నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి ‘విజిల్’ గుర్తును, కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి ‘బ్యాటరీ టార్చ్’ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. నటుడు విజయ్ 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పార్టీ, 2025 నవంబర్‌లో గుర్తు కోసం దరఖాస్తు చేసుకోగా, తాజాగా ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం ప్రస్తుతం అధికార పార్టీ డీఎంకే తో పొత్తు పెట్టుకోగా, విజయ్ పార్టీ టీఎంకే ఈ అసెంబ్లీ ఎన్నికలతోనే తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. అధికార డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయనుంది.
ఈ మేరకు ఎన్నికల సంఘం తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి కి ఉత్తర్వులు జారీ చేసింది. 1968లో అమలులోకి వచ్చిన ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వుల ప్రకారం నమోదు అయిన కానీ గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఒకే గుర్తును కేటాయించే ప్రక్రియను కమిషన్ ఆమోదించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ గుర్తులు ఆయా పార్టీల అభ్యర్థులు పోటీ చేయని నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులకు ‘ఫ్రీ సింబల్స్’గా కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, మొత్తం అసెంబ్లీ స్థానాల్లో కనీసం 5 శాతం స్థానాల్లో విజయం సాధించకపోతే, ఆయా పార్టీలు తమ గుర్తును కోల్పోయే అవకాశం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి జనవరి 17న పార్టీ తొలి దశ ఎన్నికల హామీలను ప్రకటించారు. అందులో ‘మహిళా సంక్షేమ కులవిలక్కు పథకం’ కింద రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు.
స్వాగతించిన అభిమానులు
నలుపు–తెలుపు రంగుల్లో రూపొందించిన విజిల్ గుర్తును విజయ్ అభిమానులు ఉత్సాహంగా స్వాగతించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు విజిళ్లు పంచుతూ సంబరాలు జరిపారు. ఈ సంబరాల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా సరదా క్రికెట్ శైలిలో స్పందిస్తూ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. డీఎంకే పార్టీకి చెందిన ‘రైజింగ్ సన్’, ఏఐఏడీఎంకేకు చెందిన ‘టూ లీవ్స్’ వంటి బలమైన సంప్రదాయ గుర్తులు ఉన్న రాజకీయ వాతావరణంలో, ‘విజిల్’ గుర్తు టీవీకేకు క్షేత్రస్థాయిలో గుర్తింపును పెంచే సాధనంగా మారనుంది. ఇదే సమయంలో, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వివాదాల్లోనూ నిలిచారు. తమిళనాడులో ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల అధికారిక షెడ్యూల్‌ను ఇంకా ఎన్నికల సంఘం ప్రకటించలేదు.
