
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల… రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ తన పార్టీ తమిళ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థుల పూర్తి జాబితాను ఆదివారం విడుదల చేశారు. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ, తాను చెన్నైలోని పెరంబూర్‌తో పాటు తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. డీఎంకే బలమైన కోటగా భావించే చెన్నైలోని పెరంబూర్ నుంచి పోటీ చేయడం ద్వారా ప్రత్యక్షంగా సవాల్ విసిరిన విజయ్, తిరుచిరాపల్లి ఈస్ట్‌ను కూడా తన రెండో నియోజకవర్గంగా ఎంచుకున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ రెండు స్థానాల నుంచి సి. జోసెఫ్ విజయ్ పోటీ చేస్తాడని స్పష్టంగా ప్రకటించగా, సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. మిగిలిన 232 స్థానాలకు కూడా పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. వీరిలో పార్టీ కోర్ టీమ్ సభ్యులు, అనుభవజ్ఞులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు చోటు దక్కించుకున్నారు. పెరంబూర్‌లో డీఎంకే అభ్యర్థిగా ఆర్.డి. శేఖర్, తిరుచిలో ఇనిగో ఇరుదయరాజ్ బరిలో ఉన్నారు. ఈ సందర్బంగా విజయ్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఇది నా తొలి ఎన్నికల పోరు. ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని అన్నారు. మిగిలిన 232 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు.
జెన్ జీ మద్దతు ఇవ్వాలి
విజయ్ సన్నిహిత వర్గానికి చెందిన ఎన్. ఆనంద్, ఆదవ్ అర్జున, పి. వెంకటరమణన్, ఆర్. అరుణ్‌రాజ్, సీటీఆర్ నిర్మల్ కుమార్, కేఏ సెంగొట్టయ్యన్ వంటి నేతలకు కీలక స్థానాల్లో టికెట్లు కేటాయించారు. టి నగర్, విల్లివాక్కం, గొబిచెట్టిపాళయం, తిరుప్పరంకుండ్రం వంటి నియోజకవర్గాల్లో వీరు పోటీ చేయనున్నారు. ఇక ఏఐఏడీఎంకే మాజీ మంత్రి కూ.పా. కృష్ణన్‌ను లాల్గుడి నుంచి బరిలోకి దించారు. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల నుంచి వచ్చిన కొంతమంది సీనియర్ నాయకులకు కూడా టీవీకే టికెట్లు ఇచ్చింది. ఈ ఎన్నికలు డీఎంకే కూటమి, టీవీకే మధ్య ప్రధాన పోరుగా మారతాయని విజయ్ పేర్కొన్నారు. ఇది తరం మార్పు కోసం జరుగుతున్న పోరని వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపికపై మాట్లాడుతూ ఇవాళ్టి అభ్యర్థులు కేవలం రాజకీయ నాయకులు కాదు, ప్రజల రక్షకులు అని ఆయన చెప్పారు. ముఖ్యంగా యువత (జెన్ జీ) పెద్దఎత్తున ఓటు వేసి పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగాల్లో పారదర్శకత
ఉద్యోగాల విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, నియామకాల ప్రక్రియను 365 రోజుల్లో పూర్తిచేసేలా ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం కింద డిగ్రీ పట్టా దారులకు నెలకు రూ.4,000, డిప్లొమా అభ్యర్థులకు రూ.2,500 అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించి, గ్రాడ్యుయేట్లకు రూ.10,000, ఐటీఐ/డిప్లొమా అభ్యర్థులకు రూ.8,000 భృతి ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే సంస్థలకు పన్ను రాయితీలు, విద్యుత్ సబ్సిడీలు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు. ఇంకా ‘వేత్రి ఎంట్రప్రెన్యూర్ స్కీమ్’ ద్వారా రూ.25 లక్షల వరకు గ్యారంటీ లేకుండా రుణాలు అందిస్తామని తెలిపారు. రైతులు, మత్స్యకారులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు వంటి వర్గాల కోసం ప్రత్యేక విధానాలను కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. యువత కోసం ప్రత్యేక అజెండాను కూడా ప్రకటించిన విజయ్, డ్రగ్స్‌లేని తమిళనాడు, 12వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు రూ.20 లక్షల వరకు కాలేటరల్ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
ఇక చెన్నైలో కీలక పోటీలు ఆసక్తికరంగా మారనున్నాయి. టి నగర్‌లో ఎన్. ఆనంద్‌కు డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి గట్టి పోటీ ఉండనుంది. విల్లివాక్కంలో ఆదవ్ అర్జునకు ముక్కోణపు పోటీ ఎదురవుతోంది. కొలత్తూర్‌లో ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌పై వి.ఎస్. బాబు, చెపాక్-తిరువల్లికేనిలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై డి. సెల్వం టీవీకే తరఫున పోటీ చేస్తున్నారు. ఈసారి టీవీకే 26 మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. తిరుప్పూర్ నార్త్ నుంచి వి. సత్యభామ వంటి అనుభవజ్ఞులకు టికెట్లు కేటాయించింది.
కార్యకర్తల నిరసన
అయితే అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లేదంటూ కొంతమంది కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలూరు ప్రాంతానికి చెందిన కార్యకర్తలు సమావేశ ప్రాంగణం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ తమకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మదురవోయల్ నియోజకవర్గ అభ్యర్థి పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని పేర్కొంటూ, ఈసారి ఎన్నికల్లో టీవీకేకు మంచి అవకాశాలున్నాయని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
