
టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు
కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది. జనవరి 12న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి విచారణ కోసం రావాలని విజయ్‌ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే టీవీకే పార్టీకి చెందిన ముఖ్య నాయకులైన బుస్సీ ఆనంద్, నిర్మల్ కుమార్, ఆధవ్ అర్జున్‌లను సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు స్వయంగా విజయ్‌ను విచారించడం ద్వారా ఈ ఘటన వెనుక ఉన్న బాధ్యతలను నిర్ధారించి, త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఏజెన్సీ భావిస్తోంది.
అసలేం జరిగింది?
2025, సెప్టెంబర్ 27న కరూర్‌లోని వేలుస్వామిపురంలో విజయ్ నేతృత్వంలో ఒక బహిరంగ సభ జరిగింది. తన రాజకీయ యాత్రలో భాగంగా విజయ్ అక్కడ ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన రాక దాదాపు 7 గంటలు ఆలస్యం కావడంతో, ఒక్కసారిగా ఆయన వాహనం వైపు దూసుకెళ్లేందుకు అభిమానులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. తక్కువ స్థలంలో భారీగా జనాలను సమీకరించడం, తగిన భద్రతా చర్యలు లేకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని ప్రాథమిక నివేదికలు తెలిపాయి.
కోర్టు ఆదేశాలు- సిబిఐ విచారణ
ఈ ఘటనపై మొదట తమిళనాడు ప్రభుత్వం ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ కమిషన్ వేసింది. అలాగే రాష్ట్ర పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. అయితే ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగదని భావించిన బాధితుల కుటుంబాలు, కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
అక్టోబర్ 13, 2025న సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ తొక్కిసలాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరగాలని కోర్టు పేర్కొంది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి, సీబీఐ విచారణను పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది.
సీబీఐ ఈ కేసును స్వీకరించిన తర్వాత కరూర్ సభా స్థలాన్ని పరిశీలించి, అనుమతుల జారీలో జరిగిన లోపాలను, పోలీసుల మోహరింపును క్షుణ్ణంగా తనిఖీ చేసింది. సభను నిర్వహించిన టీవీకే నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘించారని, విజయ్ రాకను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి రద్దీని పెంచారని ఆరోపణలు ఉన్నాయి.
విజయ్ తన వంతుగా మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధితులకు ఆర్థిక సహాయం అందజేశాయి. ప్రస్తుతం విజయ్ విచారణకు హాజరైన తర్వాత ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనన్నది తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
