Let's talk: editor@tmv.in
టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు

టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు

Shaik Mohammad Shaffee
7 ఫిబ్రవరి, 2026

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ. 1.5 కోట్ల పెనాల్టీని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో పాటు ఆయన నటించిన 'జననాయకన్' సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ వివాదంపై కూడా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

ఆదాయం దాచిపెట్టినందుకు భారీ జరిమానా

విజయ్ నటించిన 'పులి' సినిమా విడుదల సమయంలో 2015, సెప్టెంబర్‌లో ఐటీ శాఖ అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో సుమారు రూ. 15 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆయన వెల్లడించలేదని అధికారులు గుర్తించారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ రూ. 1.5 కోట్ల జరిమానా విధించింది. అయితే, ఈ పెనాల్టీని సవాల్ చేస్తూ విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి.. సదరు ఆదాయాన్ని విజయ్ స్వచ్ఛందంగా వెల్లడించలేదని, ఐటీ సోదాల వల్లే అది వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేస్తూ జరిమానాను సమర్థించారు.

‘జన నాయగన్’ సెన్సార్ వివాదంపై కీలక ఆదేశాలు

మరోవైపు విజయ్ తాజా చిత్రం 'జన నాయగన్‌' సెన్సార్ విషయంలోనూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ చిత్రానికి 'యూ/ఏ' సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. సెన్సార్ బోర్డు తన వాదనలను వినిపించడానికి తగిన సమయం ఇవ్వకుండానే సింగిల్ జడ్జి ఆ ఆదేశాలు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

మళ్లీ మొదటికి విచారణ

సెన్సార్ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం, ఈ కేసును తిరిగి సింగిల్ జడ్జి ధర్మాసనానికి బదిలీ చేసింది. సెన్సార్ బోర్డు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాతే దీనిపై కొత్తగా విచారణ జరపాలని ఆదేశించింది. అలాగే అవసరమైతే తమ పిటిషన్‌లోని వినతులను సవరించుకునే వెసులుబాటును చిత్ర నిర్మాతలైన కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు కల్పించింది.

విడుదలపై సందిగ్ధత

నిజానికి ఈ చిత్రం జనవరి 9నే విడుదల కావాల్సి ఉంది. అంతకుముందు హైకోర్టు సింగిల్ బెంచ్ 'యూ/ఏ 16+' సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించడంతో నిర్మాతలకు ఊరట లభించినట్లు అనిపించింది. కానీ, తాజాగా డివిజన్ బెంచ్ ఆ తీర్పును పక్కన పెట్టడంతో సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఒకే రోజు అటు వ్యక్తిగత పన్నుల వ్యవహారంలోనూ, ఇటు సినిమా విడుదలకు సంబంధించిన న్యాయ పోరాటంలోనూ విజయ్‌కు ప్రతికూల ఫలితాలు రావడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు - Tholi Paluku