Let's talk: editor@tmv.in
టీవీకేలో చేరిన ఏఐఏడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్

టీవీకేలో చేరిన ఏఐఏడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్

Pinjari Chand
28 నవంబర్, 2025

ఏఐఏడీఎంకీ పార్టీకి ఒకప్పుడు కీలక నేతగా నిలిచిన, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కే.ఏ. సెంగొట్టయన్ గురువారం అధికారికంగా తమిళ వెట్రి కళగం (టీవీకే) లో చేరారు. ఇటీవల పార్టీ నుంచి తనను బహిష్కరించడం పై ఆగ్రహంతో ఆయన బుధవారం గోబిచెట్టిపాళయం నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంగొట్టయన్ అనుచరులతో కలిసి టీవీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం విజయ్ సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసి స్వాగతం పలికారు.

50 ఏళ్ల రాజకీయ అనుభవం టీవీకేకు బలం: విజయ్

‘ఒకే ఉద్యమం కోసం దాదాపు దశాబ్దాలుగా కృషి చేసిన అన్నయ్య సెంగొట్టయన్ కి మనస్ఫూర్తిగా స్వాగతం. ఆయన రాజకీయ అనుభవం, ప్రజల మధ్య ఉన్న బలం, క్షేత్రస్థాయి నుంచి వచ్చి ఎదిగిన తీరు పట్టు ఇవన్నీ మా టీవీకేకు విలువైన సంపద అని విజయ్ అన్నారు. 20 ఏళ్ల వయసులోనే ఎంజీఆర్ నమ్మకాన్ని చూరగొన్న సెంగొట్టయన్... అప్పటి నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. ఎంజీఆర్, జయలలితలకు ఇద్దరికి ఆప్తులుగా ఉన్నారు. పురుచ్చి తలైవి జయలలిత రాజకీయ ప్రచార నిర్వహణ ప్రణాళికలు రూపొందించడంలో ఆయనది కీలక పాత్ర అని విజయ్ కొనియాడారు.

పళనిస్వామిపై సెంగొట్టయన్ ఫైర్

పార్టీ నుంచి నన్ను తొలగించిన తీరు అసంబద్ధం. దీనిపై కోర్టుకెక్కుతాను. పళనిస్వామి పార్టీని డిక్టేటర్‌లా నడుపుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎడప్పాడి కె.పళని స్వామి స్పందిస్తూ పార్టీని బలహీనపరిచే వారిపై మేం చర్యలు తీసుకుంటాం. పార్టీ పరంగా, చట్టబద్ధంగానే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

2026 ఎన్నికల్లో మారనున్న రాజకీయ లెక్కలు

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 7 నెలలు మాత్రమే ఉన్న సమయంలో సెంగొట్టయన్ టీవీకేలో చేరడం నిజంగా చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఈరోడ్ జిల్లాలో సెంగొట్టయన్‌కు తిరుగులేని ప్రజాబలం ఉంది.

కొంగు బెల్ట్‌లో ఎదురులేని నాయకుడు

సెంగొట్టయన్ తమిళ రాజకీయాల్లో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా తలపండిన నాయకుడు. కొంగు బెల్ట్ లో తిరుగులేని వ్యూహకర్త. నిశ్శబ్దంగా ప్రజాల్లోకి చొచ్చుకుపోయే రాజకీయ చతురత ఈ 76 సంవత్సరాల పొలిటికల్ కింగ్ సొంతం. ఆయన గోబిచెట్టిపాళైయం నుంచి 1977, 1980, 1984, 1989, 1991, 2001, 2011, 2016, 2021 – మొత్తం 9 సార్లు గెలిచారు. ఈ సీటును ఆయన ‘పర్సనల్ ఫిఫ్’గా మార్చేశారు. కొంగు బెల్ట్ లో గౌండర్ సామాజిక వర్గంలో బలమైన పట్టున్న లీడర్. ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, నామక్కల్, సేలం జిల్లాల్లో ఈ కమ్యూనిటీ ఓట్లు పడినవారికే దాదాపు విజయం వరిస్తుంది. ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు మంత్రిగా (వ్యవసాయం, ఐటీ, అటవీ) పనిచేశారు. ఇప్పటివరకు అవినీతి ఆరోపణలు లేకుండా రాజకీయాలు చేశారు. జయలలిత ట్రస్టెడ్ లెఫ్టినెంట్‌గా గుర్తింపు పొందారు.

కొంగు బెల్ట్ లో మొత్తం 38 ఎమ్మెల్యే సీట్లు (కోయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, నీలగిరి, సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలు కవర్ చేస్తుంది)ఉన్నాయి. ఇది తమిళనాడు మొత్తం 234 సీట్లలో 16శాతం.కానీ ఓటు బ్యాంక్ 20శాతానికి పైగా ఉంటుంది.

2021 ఎన్నికల్లో సెంగొట్టయ్యన్ ప్రభావంతో ఏఐఏడీఎంకే 26 సీట్లు సాధించింది.డీఎంకే ఈ రోడ్ వెస్ట్, కాంగ్రెస్ ఈ రోడ్ ఈస్ట్ తప్ప మిగతా అన్నీ సీట్లో ఏఐడీఎంకే ప్రాబల్యం కొనసాగింది.

1977లో మొదటిసారి సెంగొట్టయ్యన్ గెలిచినప్పుడు ఏఐఏడీఎంకేలో జానకి-జయలలిత మధ్య వచ్చిన విబేధాలతో పార్టీ విభజన సమయంలో జయలలిత వర్గానికి మద్దతిచ్చి ‘రూస్టర్’ గుర్తుపై గెలుపొందారు. దీంతో ఆయన హవా మొదలైంది.

సీరియస్ ప్లేయర్ గా మారిన టీవీకే

ఒక్క రోజులో తమిళనాడు రాజకీయ రంగం వేడెక్కింది. కొంగు గౌండర్ దిగ్గజం కె.ఎ. సేంగొట్టయన్ టీవీకేలో చేరడంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీమ్ ఒక్కసారిగా ‘సీరియస్ ప్లేయర్’గా మారిపోయింది.కొంగు బెల్ట్ లో టీవీకే మొదటిసారే 15కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. ‘విజయ్ పార్టీ అంటే యూత్ ఫ్యాన్స్ మాత్రమే’ అన్న ట్యాగ్ పూర్తిగా తొలగిపోనుంది. సెంగొట్టయన్ ఒక్కడు చేరడంతో టీవీకే 2026లో 50–60 సీట్లు దాటే అవకాశం ఉందంటున్నారు. ఏఐడీఎంకే కు 40 దాటితే గొప్పేనని చెబుతున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రమే సెంగొట్టయన్ చేరిక టీవీకే బలమా? బలహీనత అన్నది తేలుస్తుంది.

ఏఐఏడీఎంకేకు వరుస షాకులు

మొదట ఓ.పన్నీర్‌సెల్వం వర్గం విడిపోయింది ఇప్పుడు సెంగొట్టయన్ + ఆయనతోపాటు 10–15 మంది మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మండల స్థాయి నాయకులు టీవీకేలో చేరారు. ఈరోడ్ జిల్లా ఏఐడీఎంకేకి పెట్టని కోటలా ఉండేది. ఇక అక్కడ ఈపీఎస్ పార్టీ కుదేలవుతుందని నేతలే అంటున్నారు.

టీవీకేలో చేరిన ఏఐఏడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్ - Tholi Paluku