
టీవీకేతో పొత్తు లేదు: ఏఐఏడీఎంకే చీఫ్ పళనిస్వామి
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో ఎన్డీయే జట్టుకడుతుందనే ఊహగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా టీవీకే చీప్ విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటువంటి సమయంలో ఆదివారం ఎడప్పాడి కే.పళనిస్వామి స్పందించారు. కూటమి కుదుర్చుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఈ అంశంపై వస్తున్న వార్తలు కేవలం మీడియా ఊహాగానాలేనని ఆయన తేల్చిపారేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిలో టీవీకే (తమిళ వెట్రి కళగం) చేరే అవకాశముందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇప్పటివరకు టీవీకే నాయకత్వంతో ఎలాంటి చర్చలు జరగలేదని, చర్చలే లేకుండా కూటమి ఎలా ఏర్పడుతుందని ఆయన ప్రశ్నించారు. మార్చి 14న మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. టీవీకేతో కూటమి కుదురుతుందనే ప్రచారం పూర్తిగా మీడియా సృష్టించినదేనని అన్నారు. 80 సీట్లు టీవీకే ఇస్తామన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.
ఇక తనకు, బీజేపీ నాయకుడు అన్నామలై మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మార్చి 17న కోయంబత్తూరులో జరిగే నిరసన కార్యక్రమానికి అన్నామలైతో పాటు ఏఐఏడీఎంకే నేత ఎస్పీ.వేలుమణి కూడా హాజరవుతారని చెప్పారు. అదేవిధంగా టీటీవీ.దినకరన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పళనిస్వామి తెలిపారు. గతంలో కొన్ని చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అవన్నీ పరిష్కరించుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇద్దరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని డీఎంకేప్రభుత్వం లబ్ధిదారులకు రూ.5,000 చెల్లించడం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయమని, ఓటమి భయంతోనే ఈ చర్యలు తీసుకుంటోందని పళనిస్వామి విమర్శించారు.
