Let's talk: editor@tmv.in
టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్‌‌కు ఎంపీ అర్వింద్ కౌంటర్

టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్‌‌కు ఎంపీ అర్వింద్ కౌంటర్

Gaddamidi Naveen
7 ఫిబ్రవరి, 2026

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత ఏడేళ్లుగా తాను చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా స్పందించారు. ఇందూరు గడ్డపై తాము చేసిన అభివృద్ధి పనుల చిట్టాను ప్రజల ముందుంచుతూ, పీసీసీ చీఫ్‌కు ఒక విడియో ద్వారా పాయింట్ల వారీగా సమాధానమిచ్చారు.

దశాబ్దాల కాలంగా నిజామాబాద్ పసుపు రైతులు కలలుగన్న జాతీయ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించి చూపించానని అర్వింద్ గుర్తుచేశారు. దీనివల్ల పసుపు ధరలు పెరిగి, రైతులకు మేలు జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే, ఇందూరు నగరాన్ని ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మాధవ్ నగర్, మామిడిపల్లి, అర్సపల్లి వంటి ఏడు ప్రాంతాల్లో ఆర్వోబీల నిర్మాణం చేపట్టి నగరం రూపురేఖలు మారుస్తున్నామని వివరించారు.

రూ.53 కోట్ల వ్యయంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని, ముద్కేడ్, డోన్ స్టేషన్‌ల మధ్య డబ్లింగ్ ప్రాజెక్ట్‌కు, అలాగే పటాన్ చెరు,ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయ‌న వెల్లడించారు. ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల రహదారి నాలుగు లైన్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించిందని తెలిపారు. బోధన్, బాసర, భైంసా మార్గం ద్వారా కొత్త జాతీయ రహదారి ఏర్పాటుతో పాటు బోధన్–నిజామాబాద్, నిజామాబాద్–ఆర్మూర్ మార్గాల్లో రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, సీఆర్‌ఎఫ్ పథకాల ద్వారా 26 రోడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. విద్యా రంగంలో మూడు కేంద్రీయ విద్యాలయాలు, రెండు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించామని చెప్పారు. మూడు కొత్త పోస్టాఫీసుల ఏర్పాటు, పీఎఫ్ కార్యాలయంలో ఆధార్ కేంద్రాల ద్వారా 28 వేలకుపైగా బీడీ కార్మికుల వివరాలు సరిచేసినట్లు ఆయ‌న‌ తెలిపారు.

‘అర్వింద్ ఫర్ అస్’ హెల్ప్‌లైన్ ద్వారా గల్ఫ్ దేశాల్లో మరణించిన 141 మంది మృతదేహాలను స్వదేశానికి తరలించడం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న 508 మందిని భారత్‌కు రప్పించడం జరిగిందని ఆయ‌న‌ తెలిపారు. అలాగే పార్లమెంట్‌లో లేవనెత్తిన అంశాల ద్వారా ఆపరేషన్ మలేషియా, ఆపరేషన్ మయన్మార్ కార్యక్రమాల కింద వేలాది భారతీయులు స్వదేశానికి చేరుకునేలా సహకరించినట్లు ఆయ‌న పేర్కొన్నారు.

ఇవే కాకుండా మౌలిక వసతులు, ఉపాధి, యువతకు ముద్ర లోన్లు, ఉపాధి కల్పన కార్యక్రమాల ద్వారా అనేక అభివృద్ధి పనులు అమలయ్యాయని తెలిపారు. భవిష్యత్‌లో నిజామాబాద్ మీదుగా వందే భారత్ రైలు, ముద్కేడ్–డోన్ డబ్లింగ్ పూర్తయ్యాక కొత్త రైళ్లు, ఆర్మూర్–ఆదిలాబాద్, బోధన్–బీదర్ రైల్వే లైన్ల ఏర్పాట్లు జరగనున్నాయని ఆయ‌న చెప్పారు. నిజామాబాద్ అభివృద్ధిపై విమర్శలు చేయడానికి ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఎంపీ అర్వింద్ సూచించారు.

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, అమృత్ సిటీగా ఉన్న నిజామాబాద్‌ను అర్వింద్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, ఎన్నికల వేళ మతపరమైన చిచ్చు పెట్టడమే ఆయన అలవాటని మండిపడ్డారు. కేంద్రం బీసీ బిల్లును తొక్కిపెడితే ఎంపీ ఎందుకు మాట్లాడలేదని మ‌హేష్ గౌడ్ ప్రశ్నించారు. మేయర్ అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదని ఆయ‌న పేర్కొన్నారు.

టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్‌‌కు ఎంపీ అర్వింద్ కౌంటర్ - Tholi Paluku