
టీడీపీ స్వయంకృతాపరాధం
టీడీపీ వ్యవహారశైలి జగన్ క్రేజ్ పెంచుతోందా ?. టీడీపీ సవాల్ జగన్ రోడ్డు మీదకు రావడానికి కారణమైందా ?. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంలో టీడీపీ రాంగ్ స్టెప్ వేసిందా ?. జగన్ ను రెచ్చగొట్టి మరీ మెడికల్ కాలేజీల పర్యటనకు తీసుకొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ తో నిర్మించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని సాధారణంగా వైసీపీ వ్యతిరేకిస్తుంది. అది సహజం. వైసీపీ విమర్శలకు టీడీపీ అతిగా స్పందించింది. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి మరీ.. జగన్ హయాంలో నిర్మాణమే జరగలేదని, జగన్ అబద్ధాలు చెబుతున్నారని ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా స్పీకర్, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు తన నియోజకవర్గంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజికి అనుమతి ఎక్కడ ఉంది ?. జీవో ఉంటే చూపించండి అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్ ను జగన్ స్వీకరించారు. రాష్ట్రంలో చాలా మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటి వద్దకు వెళ్లకుండా.. నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
జగన్ నిర్ణయం రాగానే కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 18 షరతులతో కూడిన పర్యటనకు అనుమతి ఇచ్చింది. కానీ జగన్ పర్యటనలో పోలీసులు విధించిన షరతులు అమలు కాలేదు. పైగా జనం తరలివచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ ను కలిశారు. వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆ తర్వాత నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు జగన్ వెళ్లారు. తన హయాంలో రాష్ట్రంలో మెడికల్ హబ్ ను తీర్చిదిద్దేందుకు తీసుకున్న చర్యలు గురించి ప్రజలకు వివరించారు. అమరావతిలో రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు, రూ.5 వేల కోట్లతో మెడికల్ కాలేజీలు పూర్తీ చేయలేరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఇచ్చిన జీవోను చూపించారు. స్పీకర్ పదవిలో ఉండి అబద్ధాలు చెప్పడం సబబా అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని ప్రశ్నించారు.
మొత్తంగా జగన్ పర్యటన సక్సెస్ అయినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో జగన్ రోడ్డు మీదకు రావడానికి కూటమి ప్రభుత్వమే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ నేతలు సవాళ్లు విసరడం, ఇష్టానుసారంగా మాట్లాడటం కారణంగా జగన్ లో పట్టుదల పెరిగి, మెడికల్ కాలేజీల అంశంలో జనంలోకి వచ్చారన్నది అంచనా. టీడీపీ నేతలు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంలో అతిగా స్పందించి ఉండకపోతే జగన్ ఈ స్థాయిలో కౌంటర్ అటాక్ చేసేవారు కాదని అభిప్రాయపడుతున్నారు. జగన్ ను రెచ్చగొట్టి మరీ, టీడీపీ జగన్ క్రేజ్ పెంచుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు
