Let's talk: editor@tmv.in
టీడీఆర్ నిబంధనలను సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

టీడీఆర్ నిబంధనలను సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Gaddamidi Naveen
23 మార్చి, 2026

భాగ్యనగరంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు, గృహ నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) వినియోగానికి సంబంధించి నిబంధనలను సడలిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మార్చి 21, 2026న జీవో ఎంఎస్ నంబర్ 95ను విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న ప్రాజెక్టులకు ఈ నూతన సవరణలు వర్తించనున్నాయి.

గతంలో అదనపు అంతస్తుల నిర్మాణం కోసం కనీసం 10 శాతం టీడీఆర్ కలిగి ఉండాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు దానిని 3 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. దీనివల్ల బిల్డర్లపై ముందస్తు పెట్టుబడి భారం తగ్గుతుంది. నిర్మాణదారులు టీడీఆర్ రుసుములను ఒకేసారి కాకుండా, విడతల వారీగా చెల్లించే వెసులుబాటును కల్పించారు. ఇది నగదు లభ్యత సమస్యను పరిష్కరిస్తుంది.పెద్ద ప్లాట్లలో చేపట్టే నిర్మాణాలకు అదనంగా ఐదు అంతస్తుల వరకు నిర్మించుకునేలా ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. 2012 నాటి భవన నిర్మాణ నిబంధనలకు పలు సవరణలు చేస్తూ, నిర్మాణ ప‌రిమితులలో సౌలభ్యాన్ని పెంచారు.

పెరుగుతున్న నిర్మాణ వ్యయం నేపథ్యంలో ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊరటనిస్తుందని క్రెడాయ్ వంటి సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మూసీ రివర్‌ఫ్రంట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం నగదుకు బదులుగా టీడీఆర్ వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈ మార్పులు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూనే, నగరాన్ని నిలువునా అభివృద్ధి చేయడమే తమ ప్రాధాన్యతని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ మార్పులు చేయడానికి ముందు పలు వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించినట్లు తెలిపింది.

భవన నిర్మాణ నిబంధనలను సరళీకరించడం, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం, అలాగే భద్రతా ప్రమాణాలను కాపాడుతూ నగర అభివృద్ధిని ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు వెల్లడించారు. మొత్తంగా, ఈ సవరణలు హైదరాబాద్ నిర్మాణ రంగంలో కొత్త ఊపు తీసుకురావడమే కాకుండా, పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలకంగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

టీడీఆర్ నిబంధనలను సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - Tholi Paluku