
టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.1 కోటి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న 'శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన సుబ్బారావు అపారెల్స్ సంస్థ ఆదివారం రూ. 1 కోటి రూపాయలను విరాళంగా అందజేసింది. తిరుమలలోని టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి చి.వెంకయ్య చౌదరిని సదరు సంస్థ ప్రతినిధులు కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) ద్వారా భక్తులకు సామాన్య ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను అందించే లక్ష్యంతో టీటీడీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాగా ఈ విరాళం ద్వారా స్విమ్స్‌లో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచడం, అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చుకోవడం,పేద రోగులకు ప్రామాణిక చికిత్సను అందించడం సులభతరమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ పరిరక్షకుడిగా ఉన్న టీటీడీ, కేవలం ఆధ్యాత్మిక సేవలకే పరిమితం కాకుండా విరాళాల ద్వారా విద్య, వైద్య, సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. భక్తులు,వివిధ సంస్థల నుండి అందే ఇటువంటి ఉదారమైన విరాళాల వల్ల సామాజిక సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలవుతున్నాయని టీటీడీ యాజమాన్యం వెల్లడించింది .
