Let's talk: editor@tmv.in
టీటీడీ లడ్డూ వ్యవహారం…విచారణకు ఏక సభ్య కమిటీని ఏర్పాటు

టీటీడీ లడ్డూ వ్యవహారం…విచారణకు ఏక సభ్య కమిటీని ఏర్పాటు

Panthagani Anusha
6 ఫిబ్రవరి, 2026

కోట్లాదిమంది భక్తుల ఆరాధ్యదైవం తిరుమల వేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదమైన లడ్డూ తయారీలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కుంభకోణంలో వ్యవస్థాత్మక లోపాలను శాశ్వతంగా సరిదిద్దేందుకు ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులతో నిర్వహించిన కీలక భేటీ అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు.

నివేదికలను ఎందుకు తొక్కిపెట్టారు?

ఈసందర్బంగా చంద్రాబునాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఆధారాలతో సహా సీఎం వివరించారు. 2022లోనే సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదికలో నెయ్యి నాణ్యత లోపాలను ఎత్తిచూపినా అప్పటి పాలకులు ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. కేవలం రూ. 320కే నెయ్యి సరఫరా చేసే సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనుక ఉన్న మతలబు ఏమిటని నిలదీశారు. తాము అధికారంలోకి రాగానే ఎన్‌డీడీబీ-క్యాల్ఫ్ ప్రయోగశాలకు పంపిన శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు, చేప నూనె కలిసినట్లు నిర్ధారణ అయిందని, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్ నివేదికను పరిశీలించి, పరిపాలనాపరమైన లోపాలను సరిదిద్దేందుకు ఒక ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

క్షమాపణ చెప్పే వరకు వదిలేది లేదు: పవన్ కళ్యాణ్

ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైకాపా నేతలు తమకు తామే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీబీఐ ఎక్కడా వైకాపాకు క్లీన్ చిట్ ఇవ్వలేదని లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిందన్నది నిజమని ఆయన పునరుద్ఘాటించారు. "వైకాపా నేతలు వ్యక్తులపై కాదు, సాక్షాత్తూ ఆ ఏడుకొండల వాడిపైనే పగ పెట్టుకున్నారు. తప్పు ఒప్పుకోకుండా తిరిగి ఎదురుదాడి చేయడం వారి అహంకారానికి నిదర్శనం. భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు మా యుద్ధం కొనసాగుతుంది" అని పవన్ పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అవకాశాన్ని అపవిత్ర పనులకు వాడుకున్న వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

అక్రమాల పుట్ట ‘టెండర్ల’ ప్రక్రియ: పీవీఎన్ మాధవ్

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, పాలు సేకరించని డైరీలకు నెయ్యి కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక భారీ అవినీతి దాగి ఉందన్నారు. అన్యమతస్థుల ప్రాబల్యంతో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. నాణ్యత లేని నెయ్యితో లడ్డూలు తయారు చేసి భక్తుల ఆరోగ్యంతో పాటు విశ్వాసంతో ఆడుకున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ నాణ్యత నియంత్రణ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా కూటమి నేతలు ప్రకటించారు.

టీటీడీ లడ్డూ వ్యవహారం…విచారణకు ఏక సభ్య కమిటీని ఏర్పాటు - Tholi Paluku