
టీటీడీ పవిత్రతను కాపాడటం ప్రభుత్వ కర్తవ్యం: మంత్రి పయ్యావుల కేశవ్
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ క్యాబినెట్ సమావేశంలో జరిగిన కీలక చర్చలను వెల్లడించారు.
అజెండా పక్కనపెట్టి.. లడ్డూపైనే సుదీర్ఘ చర్చ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముందుగా నిర్ణయించిన అజెండా అంశాలన్నింటినీ పక్కనబెట్టి, కేవలం టీటీడీ నెయ్యి కల్తీపైనే సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన 11 పేజీల గోప్య నివేదికపై మంత్రి మండలి మూడు గంటల పాటు చర్చ జరిపింది. కాగా గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు విధానంలో జరిగిన భారీ అవకతవకలను ఈ నివేదిక బట్టబయలు చేసిందని పయ్యావుల పేర్కొన్నారు.
నిబంధనలు తుంగలోకి.. కల్తీకి పచ్చజెండా
2019 తర్వాత టీటీడీ నెయ్యి టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే సడలించినట్లు సిట్ నివేదికలో వెల్లడైందని మంత్రి పేర్కొన్నారు. రూ.250 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధనను రూ.150 కోట్లకు తగ్గించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. కనీస అనుభవం లేని సంస్థలకు సైతం అర్హత కల్పించి సుమారు 58 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి సరఫరాకు మార్గం సుగమం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌డిడీబీ ల్యాబ్ పరీక్షల్లో ఈ నెయ్యిలో సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌తో పాటు జంతువుల కొవ్వు (బీఫ్ టాలో, లార్డ్), ఫిష్ ఆయిల్ ఉన్నట్లు తేలడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు
ఈ కుంభకోణంలో అప్పటి సీనియర్ అధికారులు ఏ.వీ. ధర్మారెడ్డి, అనిల్‌కుమార్ సింహాల్, ఓ.బాలాజీ వంటి వారి పాత్రపై సిట్ నివేదికలో ప్రస్తావన ఉందని మంత్రి తెలిపారు. 2022లో సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ) హెచ్చరించినా అప్పటి పాలకమండలి పట్టించుకోకపోవడం వెనుక గల కారణాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించేందుకు ఒక స్వల్పకాలిక పరిపాలనా కమిటీని కూడా ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
రాజకీయ వక్రీకరణలకు తావులేదు
మంత్రులు కొలుసు పార్థసారధి, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఇది కేవలం రాజకీయ అంశం కాదని కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. అడ్వకేట్ జనరల్ సలహాతో చట్టపరంగా ముందుకు వెళ్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ పాలే లేకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేసి భక్తులకు వడ్డించడం సృష్టికి విరుద్ధమని, అపవిత్రమైన పాలనలో జరిగిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
