
టీటీడీ “పరకామణి” కేసు కీలక సాక్షి సతీష్ అనుమానాస్పద మృతి
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోటుచేసుకున్న విదేశీ కరెన్సీ దోపిడీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడు, మాజీ ఏవీఎస్‌వో వై. సతీష్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా భారీ సంచలనం రేగింది. ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా కాకుండా హత్య అనుమానాలు తలెత్తడంతో కేసు తీవ్రత మరింత పెరిగింది.
పరకామణి కేసులో కీలక సాక్షి
కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన సతీష్ కుమార్ ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా పనిచేస్తున్నారు. 2015–19 మధ్య కాలంలో టీటీడీలో అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో పరకామణి నగదు లెక్కింపులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సి.వి. రవికుమార్ అమెరికన్ డాలర్లను దొంగిలిస్తున్నాడని 2023 ఏప్రిల్‌లో సీసీటీవీ ఆధారాలతో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు తర్వాత రవికుమార్‌పై విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఐపీసీ సెక్షన్ 468 కింద ఛార్జ్‌షీట్ నమోదుచేసింది. కాగా దర్యాప్తులో అతని వద్ద కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.
కేసు దర్యాప్తుకోనసాగుతున్న క్రమంలో అనూహ్యంగా ఈ కేసును లోక్‌అదాలత్‌కు బదిలీచేశారు. రవికుమార్ టిటిడికి తనకు చెందిన ఏడు ఆస్తులు విరాళంగా ఇస్తానని అంగీకరించటంతో 2023 సెప్టెంబర్‌లో లోక్‌అదాలత్ ద్వారా రాజికిరావడంతో కేసు మూసివేశారు. అయితే అప్పట్లో ఈ రాజీ పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. గత ప్రభుత్వ ఒత్తిడి వల్లే రాజీ జరిగిందని వచ్చిన ఆరోపణలతో హైకోర్టు జోక్యం చేసుకొని లోక్‌అదాలత్ తీర్పును రద్దు చేసి, కేసుని సిఐడి –ఏసీబీకి మళ్లించింది.
సీఐడీ విచారణ కీలక దశలో కేసు అనూహ్య మలుపు
ఇటీవల ఈ కేసు కీలక దశకు చేరడంతో సీఐడీ విచారణ వేగవంతమైంది. ఈ నెల 6న సతీష్ మొదటిసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. రెండోసారి విచారణ కోసం గురువారం రాత్రి గుంతకల్లు నుండి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున తాడిపత్రి–గూటి సెక్షన్‌లోని కోమాలి–జూటూరు స్టేషన్ల మధ్య ఆయన మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. A1 కోచ్‌లో 29వ బెర్త్ రిజర్వేషన్ నమోదు ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో రైలు నుండి దిగి ట్రాక్‌పై పడిపోయారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.
కానీ మృతదేహంపై లోతైన గాయాలు, తల వెనుక భాగంలో గొడ్డలి వంటి పదునైన ఆయుధంతో కోసిన గుర్తులు కనపడటంతో వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులు ఇది ఆత్మహత్య కాదని, స్పష్టమైన హత్య అని ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఫోరెన్సిక్ వైద్యుల సమక్షంలో ఎంఆర్ఐ సిటి స్కాన్‌లను నిర్వహించి ఈ నిర్ధారణకు వచ్చారు.
బంధువుల ఆరోపణలు
ఈ నేపథ్యంలో సతీష్ బంధువులు రైల్వే పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పరకామణి డాలర్ల చోరీ కేసులో నిందితులు, వారికి మద్దతు ఇచ్చిన ఉన్నతాధికారులే సతీష్‌ను హత్య చేశారు అని ఆరోపించారు. దీనిపై గుత్తి జీఆర్‌పీ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఇదే ఆరోపణలు చేస్తూ, “సతీష్‌కు కేసు కారణంగా ప్రాణహాని ఉందని ఆయన తరచూ చెప్పేవాడు. నిజాయితీగా పనిచేస్తున్నందుకు ఆయనను టార్గెట్ చేశారు అని ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
సతీష్ మరణంతో పరకామణి దోపిడీ కేసు మరింత క్లిష్ట దశకు చేరింది. రాజకీయ రంగంలో ఆరోపణలు ముదురుతున్నాయి. కూటమి నేతలు వైఎస్సార్సీపీ పెద్దల ప్రమేయం ఉందని ఆరోపిస్తుండగా, వైఎస్సార్సీపీ మాత్రం పూర్వ ప్రభుత్వ హయాంలోనే అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది.
అనంతపురం ఎస్పీ జగదీష్, గూటి జీఆర్పీ సీఐ అజయ్‌కుమార్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. సీఐడీ ఇప్పటికే పరకామణి కేసులో పత్రాలు, సీసీటీవీ ఫుటేజ్, రాజీ పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో, ఇప్పుడు ఫిర్యాదుదారు సతీష్ మృతి విచారణపై మరింత ఒత్తిడి తీసుకొచ్చింది. హైకోర్టు ఆదేశించిన నివేదిక సమర్పణ గడువు దగ్గరపడుతున్న వేళ సతీష్ మరణం మరిన్ని రాజకీయ, పరిపాలనా ప్రకంపనలకు దారితీయనుంది.
