Let's talk: editor@tmv.in
టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

Panthagani Anusha
7 ఫిబ్రవరి, 2026

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన కార్యనిర్వాహక అధికారిగా (ఈవో) సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి సమక్షంలో ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న రవిచంద్రకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇటీవల బదిలీ అయిన అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో రవిచంద్ర ఈ బాధ్యతలను స్వీకరించారు. గత కొంతకాలంగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీకి సంబంధించి చెలరేగిన వివాదం నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి టెండర్ నిబంధనలను ఖరారు చేయడంలో అప్పటి అధికారులు నిర్లక్ష్యం వహించారని ప్రభుత్వం భావిస్తోంది.

ముఖ్యంగా లడ్డూ నెయ్యి కల్తీ కుంభకోణం కేసులో మాజీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఎఫ్ఏ, సీఏఓ ఓ. బాలాజీ, మాజీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి తదితరులపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. టెండర్ షరతులను సరిగ్గా పరిశీలించకుండానే ఆమోదించడం వల్లే కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం ఏర్పడిందని దీనిపై సీబీఐ నేతృత్వంలోని సిట్ లోతుగా విచారణ జరుపుతోందని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో నూతన ఈఓగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర ముందు సవాళ్లతో కూడిన బాధ్యతలు ఉన్నాయి. ఆలయ పవిత్రతను కాపాడటం ప్రసాదాల నాణ్యతపై భక్తుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఆయన పాలన సాగనుంది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి సేవ చేసే భాగ్యం కలగడం తన అదృష్టమని పేర్కొన్నారు.

టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర - Tholi Paluku