Let's talk: editor@tmv.in
టీటీడీ నిధులపై షర్మిల వ్యాఖ్య‌లు వివాదాస్పదం

టీటీడీ నిధులపై షర్మిల వ్యాఖ్య‌లు వివాదాస్పదం

FL - SUNL
30 సెప్టెంబర్, 2025

తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల వినియోగంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారాన్ని రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దళిత కాలనీల్లో 5,000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ నిధులను వినియోగించాలన్న నిర్ణయాన్ని షర్మిల విమర్శించారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల అమలుకే నిదర్శనమని ఆరోపించారు. “టీటీడీ పవిత్ర సంస్థ. అయితే, దాని నిధులను దళితుల హాస్టళ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలి. ఆలయాల వల్ల అభివృద్ధి జరుగుతుందా? ఆ ఆలయాల్లో పూజారులు దళితులేనా?” అని ఆమె ప్రశ్నించారు.

ఘాటుగా స్పందించిన బీజేపీ

షర్మిల వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్రంగా స్పందించారు. టీటీడీ నిధులు భక్తుల దానాలపై నడుస్తాయని, అలాంటి నిధులతో ఆలయాలు నిర్మించడం తగినదేనని స్పష్టం చేశారు. షర్మిల వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. ఇతర బీజేపీ నేతలు యామిని శర్మ, శివస్వామి కూడా షర్మిలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీటీడీ ఇప్పటికే పాఠశాలలు, ఆసుపత్రులు, కళాశాలల ద్వారా సామాజిక సేవలందిస్తోందని, ఆలయాల నిర్మాణం ద్వారా శ్రీవేంకటేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్క‌రికి అందాలన్నదే ఉద్దేశమని పేర్కొన్నారు. షర్మిల అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.

వైసీపీ మద్దతు షర్మిలకేనా

మరోవైపు వైసీపీ నేత వై.వి. సుబ్బారెడ్డి సైతం షర్మిల వ్యాఖ్యలనే సమర్థించినట్లు మాట్లాడారు. ఆలయాల కంటే దళితులకు ఉపయుక్తమైన విద్యా, వైద్య వ్యవస్థలపై నిధులను ఖర్చు చేయాలన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సమానత్వం, దళిత మైనారిటీ సంక్షేమాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీజేపీ కూటమి హిందూ సెంటిమెంట్‌లపై దెబ్బ తీసే వ్యాఖ్యలు అని వాదిస్తోంది. ఈ అంశంపై ఇంకా మిగిలిన పార్టీల స్పందనలు రావాల్సి ఉంది. మొత్తంగా ఏపీలో సున్నితమైన మత అంశాన్ని రాజకీయం చేసినట్లయింది.

టీటీడీ నిధులపై షర్మిల వ్యాఖ్య‌లు వివాదాస్పదం - Tholi Paluku