
టీటీడీ ట్రస్టుకు రూ. 2 కోట్ల విరాళం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలోని వివిధ సేవా ట్రస్టులకు భారీ విరాళాలు అందాయి. విశాఖపట్నం, బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా విరాళాన్ని ఆదివారం టీటీడీకి అందజేశాయి.
ప్రాణదాన ట్రస్ట్‌కు కోటి రూపాయలు
విశాఖపట్నానికి చెందిన ప్రముఖ సంస్థ 'దేవి ఫిషరీస్ లిమిటెడ్' శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు తమ ఉదారతను చాటుకుంది. ఆ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డలు కలిసి రూ.1 కోటి కంటే ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అందజేశారు. తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆలయ అధికారి రామకృష్ణను కలిసి వారు ఈ మొత్తాన్ని అందజేశారు.
గత 2001 నుంచి కొనసాగుతున్న ఈ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద రోగులకు టీటీడీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది.
మరోవైపు బెంగళూరుకు చెందిన 'బిల్వా ఇన్‌ఫ్రా' సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఎస్ నాయర్ శ్రీవారి పట్ల తన భక్తిని చాటుకున్నారు. శారీరక వికలాంగులకు పునరావాసం అత్యాధునిక శస్త్రచికిత్సలు అందించే బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (బిఐఆర్ఆర్డి) ట్రస్ట్‌కు ఆయన రూ.1 కోటి విరాళంగా అందజేశారు. ఈ నిధులను వికలాంగుల వైద్య సేవలు మౌలిక సదుపాయాల మెరుగుదలకు వినియోగించనున్నారు.
