Let's talk: editor@tmv.in
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలి

టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలి

Panthagani Anusha
5 ఏప్రిల్, 2026

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శనివారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. టీటీడీ నూతన చైర్మన్ బి.ఆర్. నాయుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ దేవస్థాన ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తప్పించాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాడేరు, నెల్లూరు, టెక్కలి నియోజకవర్గాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

మోదకొండమ్మ ఆలయంలో పూజలు

పాడేరు నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తికి నైతిక విలువలు ఉండాలని కానీ బీఆర్ నాయుడు వ్యవహారశైలి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనకేసుకురావడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

నైతిక విలువలు లేని పదవి తగదు

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. పవిత్రమైన తిరుమల సన్నిధిలో అపవిత్ర కార్యకలాపాలకు తావుండకూడదని నైతికత లేని నాయుడు చైర్మన్ పదవికి అనర్హుడని ఆయన స్పష్టం చేశారు. అటు టెక్కలిలో నియోజకవర్గ ఇంచార్జ్ తిలక్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలి - Tholi Paluku