
టీటీడీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1 కోటి విరాళం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై ఉన్న అనన్య భక్తిని చాటుకుంటూ హైదరాబాద్‌కు చెందిన రాచమల్లు వెంకట సుజిత అనే భక్తురాలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్’కు రూ. 1 కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. శుక్రవారం తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును దాత కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును స్వయంగా అందజేశారు.
కాగా హిందూ ధర్మంలో గోవుకు ఉన్న అత్యున్నత ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను కాపాడటమే లక్ష్యంగా ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. తిరుమల, తిరుపతి పరిసరాల్లోని గోశాలల్లో ఉన్న వేలాది గోవుల సంరక్షణ, పోషణ, వైద్య సదుపాయాలు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. భక్తులు సమర్పించే విరాళాలతో గోశాలల నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.
టీటీడీ నిబంధనల ప్రకారం, గోసంరక్షణ ట్రస్ట్‌కు భక్తులు ఇచ్చే ప్రతి విరాళానికి సమానమైన మొత్తాన్ని టీటీడీ తన వంతుగా జత చేస్తుంది. ఈ ప్రత్యేక విధానం వల్ల భక్తులు అందించే ఆర్థిక సాయం రెట్టింపు అయ్యి ట్రస్ట్ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి తోడ్పడుతోంది. దాతలు అందించే ఇటువంటి భారీ విరాళాలు గోవుల సంరక్షణకు,సేవకు మరింత ఊతాన్ని ఇస్తాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ అధికారిక నిర్వాహక సంస్థగా టీటీడీ కేవలం ఆలయ వ్యవహారాలే కాకుండా విద్యా, వైద్య, అన్నప్రసాద,ధార్మిక రంగాల్లో విశేష సేవలు అందిస్తోంది. సమాజ సేవలో భాగంగా నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. తాజాగా అందిన ఈ కోటి రూపాయల విరాళం గోసేవలో మరో ముందడుగుగా టీటీడీ అభివర్ణించింది.
