
టీటీడీ ఆలయాల విశిష్టతకు డిజిటల్ సాంకేతికత
టీటీడీకి చెందిన స్థానిక అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు మరింత సమర్థవంతంగా చేరవేసేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలి అని టీటీడీ కార్యనిర్వాహక అధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీలను ఉపయోగించి ఆలయాల చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక విశిష్టతను భక్తులకు వివరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శనివారం టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈవో మాట్లాడారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్థానిక అనుబంధ ఆలయాల శిల్ప సౌందర్యం, నిర్మాణ వైభవం, చరిత్రను భక్తులు సులభంగా తెలుసుకునేలా అవసరమైతే ప్రత్యేక మొబైల్ యాప్ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. భక్తులు ఆలయాల్లోని శిల్పాలు, విగ్రహాలు, చిత్రాలను సెల్‌ఫోన్‌తో స్కాన్ చేసిన వెంటనే వాటికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక విశేషాలు కనిపించేలా నూతన సాంకేతికతతో అనుసంధానం చేయాలని సూచించారు.
అదేవిధంగా ఆలయాల ప్రాముఖ్యతను ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా వర్చువల్ రియాలిటీ సహకారం ఎలా తీసుకోవచ్చో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాలను టీటీడీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న నిత్య కైంకర్యాలను ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్న తరహాలో, టీటీడీకి చెందిన స్థానిక, అనుబంధ ఆలయాల విశిష్టత, ప్రత్యేక పూజలు, ఉత్సవాలను భక్తులకు చేరవేసేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో మరో అదనపు ఛానల్ ప్రారంభించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఈవో సూచించారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక, అనుబంధ ఆలయాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని వారు తరచూ ఆలయాలను సందర్శించి అభివృద్ధి పనులపై నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిపాలనా అంశాలపై మాట్లాడుతూ టీటీడీ ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఆలయంలో ఒక జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో ప్రత్యేక అకౌంట్ తెరిచి ఈ రెండు ఖాతాలను ప్రత్యేక అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే అన్నప్రసాదాల కోసం ఉన్న ఖాతాలను కొనసాగించాలని తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సీసీటీవీలు, భద్రత, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ అంశాలపై టీటీడీ సీవీఎస్‌వోతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆలయాల్లో కైంకర్యాలు, వాహన సేవలు, ప్రధాన ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు భక్తులకు వైద్య సేవలు, శ్రీవారి సేవకుల సేవలు, పుష్కరిణుల పరిశుభ్రత, బడ్జెట్, వ్యర్థాల నిర్వహణ, మరుగుదొడ్ల సదుపాయాలు తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, సీవీఎస్‌వో కె.వి.మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ.బాలాజీ, సీఈ టీవీ సత్యనారాయణ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
