
టీటీడీలో భారీ కుంభకోణం… పట్టు శాలువాల పేరుతో పాలిస్టర్!
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పాలనలో ఇటీవలి కాలంలో వరుసగా అవకతవకలు వెలుగు చూస్తుండటం భక్తులలో ఆందోళన కలిగిస్తోంది. మొన్నటిదాకా పరకామణి కేసు అదేవిధంగా శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి, ఇప్పుడు ఆ వరుసలో మరో బారి పట్టు శాలువాలు కుంభకోణం చేరింది. భక్తులకు 'ఆశీర్వచనం' (ఆశీర్వాదం) సమయంలో సాంప్రదాయంగా అందించే పట్టు దుపట్టాల (శాలువాలు) పేరుతో సంవత్సరాల తరబడి నాసిరకం పాలిస్టర్ వస్త్రాలను సరఫరా చేసినట్లు తేలింది. సుమారు రూ. 54.95 కోట్ల విలువైన కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగినట్లు అంతర్గత విజిలెన్స్ విచారణలో స్పష్టమైంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని టీటీడీ ధర్మకర్తల మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని అధికారికంగా కోరింది.
టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదిక ప్రకారం 2015 నుంచి 2025 వరకు పట్టు శాలువాల సరఫరా దాదాపు పూర్తిగా ఒకే సంస్థ నియంత్రణలో ఉంది. ఈ పదేళ్ల కాలంలో ఆ సంస్థ టీటీడీకి రూ. 54.95 కోట్ల విలువైన వస్త్రాలను విక్రయించింది. అయితే, ఈ వస్త్రాలు నిజమైన మల్బరీ పట్టు కాదని, కేవలం పాలిస్టర్‌తో తయారైన నకిలీ మెటీరియల్ అని బెంగళూరు, ధర్మవరం నగరాల్లోని అధునాతన ప్రయోగశాలల పరీక్షా ఫలితాలు స్పష్టంగా నిర్ధారించాయి. సరఫరాదారులు టెండర్ నిబంధనల్లో పేర్కొన్న "సిల్క్ మార్క్," జరీ నాణ్యత, బరువు, డిజైన్ వంటి ఎటువంటి ప్రమాణాలను పాటించలేదని విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.
కొత్త కొనుగోలు ప్రతిపాదనతో విషయం వెలుగులోకి..
ఇటీవల 21,600 పట్టు దుపట్టాల కొనుగోలు ప్రతిపాదన ధర్మకర్తల మండలి ముందుకు వచ్చినప్పుడు ఈ అక్రమంపై తొలి అనుమానాలు తలెత్తాయి. దీంతో బోర్డు సభ్యులు అప్రమత్తమై, ప్రస్తుతం గోదాముల్లో ఉన్న స్టాక్ నాణ్యతను తనిఖీ చేయాలని చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ)ను ఆదేశించారు.
సీవీఎస్ఓ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తిరుమల తిరుపతిలోని స్టాక్ గోదాముల్లోని వస్త్రాల నమూనాలను సేకరించి రెండు వేర్వేరు ల్యాబ్‌లకు పంపారు. ఆ రెండు ల్యాబ్‌ల్లోనూ అవి పట్టు వస్త్రాలు కాదని, పాలిస్టర్ మాత్రమేనని తేలడంతో కొనుగోళ్లలో జరిగిన భారీ అవకతవకల పరిమాణం బయటపడింది.
శాంపిల్ మార్పిడిపై విజిలెన్స్ అనుమానం
ఈ దర్యాప్తులో మరింత ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. గతంలో ఇదే స్టాక్ నుంచి తీసిన నమూనాలను కాంచీపురంలోని ల్యాబ్ ఆమోదించిన రికార్డులు టీటీడీ వద్ద ఉన్నాయి. కానీ తాజాగా తీసిన నమూనాలు ఫెయిల్ కావడంతో, నమూనాలలో మార్పిడి జరిగి ఉంటుందా? లేదా ల్యాబ్ స్థాయిలో ఏదైనా అవకతవకలు జరిగాయా? అనే అనుమానాలను విజిలెన్స్ అధికారులు వ్యక్తం చేశారు.
ఈ అంశాలపై సమగ్ర విచారణ జరపాలని సరఫరాదారుడు భారీ మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ అవుతున్నందున బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీవీఎస్ఓ తమ నివేదికలో స్పష్టంగా సిఫార్సు చేశారు.ఇదిలాఉండగా పదేళ్లకు పైగా కొనసాగిన అక్రమాలుగా భావిస్తున్నట్టు అధికారులు సూచిస్తున్నారు. ఈ వ్యవహారంతో దేవస్థానానికి దాదాపు రూ.54 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా.
“సాధారణంగా ఒక్క శాలువా ధర సుమారు రూ.350 మాత్రమే. కానీ దీనికి రూ.1,300 చొప్పున బిల్లులు వేశారు. మొత్తం సరుకుల విలువే రూ.50 కోట్లకు మించి ఉంటుంది. అందుకే మేము అవినీతి నిరోధక శాఖతో విచారణ చేపట్టాలని అభ్యర్థించాం అని టీటీడీ నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఏసీబీకి అప్పగింత, కొత్త టెండర్లు రద్దు
విజిలెన్స్ నివేదికలో తీవ్రత దృష్ట్యా టీటీడీ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. ప్రస్తుత కొనుగోలు టెండర్లను తక్షణమే రద్దు చేసింది. ఇంతటి బారి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపేందుకు అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)కి అప్పగించాలని నిర్ణయించింది. భవిష్యత్ కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత ఉండేలా కొత్త టెండర్లను ఆహ్వానించాలని కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ భారీ కుంభకోణంలో సరఫరాదారుకు టీటీడీలోని అంతర్గత అధికారుల సహకారం ఎంతవరకు ఉంది? గత లావాదేవీల్లో ఇంకా ఎన్ని అక్రమాలు దాగి ఉన్నాయి? వంటి విషయాలు ఏసీబీ విచారణతో బయటపడనున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయాన్ని నిర్వహిస్తున్న టీటీడీలో ఇలాంటి అవకతవకలు జరగడం భక్తుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
