Let's talk: editor@tmv.in
టీటీడీకి రూ.90 లక్షల విలువైన వైద్య పరికరాలు విరాళం

టీటీడీకి రూ.90 లక్షల విలువైన వైద్య పరికరాలు విరాళం

Panthagani Anusha
2 ఫిబ్రవరి, 2026

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై ఉన్న అచంచల భక్తిని చాటుకుంటూ ముంబయికి చెందిన ల్కెమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధురిమా సింగ్ తన ఉదారతను చాటుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌కు రూ.90 లక్షల విలువైన వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు.

తిరుపతిలోని ఆసుపత్రి ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పరికరాలను టీటీడీ సంయుక్త కార్యనిర్వాహక అధికారి (ఆరోగ్యం,విద్య) ఏ.శరత్‌కు మధురిమా సింగ్ అధికారికంగా అందజేశారు. విరాళంగా అందిన వాటిలో నాలుగు అధునాతన వెంటిలేటర్లు, నాలుగు పేషెంట్ మానిటర్లు, నాలుగు హ్యూమిడిఫైయర్లు, అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్న చిన్నారులకు ఉపయోగపడే నాలుగు హై–ఫ్లో నాజల్ క్యానులా పరికరాలు ఉన్నాయి.

ప్రాణదాన ట్రస్ట్ ద్వారా సమాజహితం

ఈ సందర్భంగా జేఈవో శరత్ మాట్లాడుతూ చిన్నారుల ప్రాణాలు కాపాడే మహత్కార్యంలో దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. టీటీడీ కేవలం ఆధ్యాత్మిక సేవలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో వైద్య, విద్య రంగాల్లో విశేష సేవలు అందిస్తోందని తెలిపారు. శ్రీ పద్మావతి బాలల హృదయ చికిత్సాలయం ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే రెండు వేలకుపైగా క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.

కాగా ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో పుట్టిన పసికందుల నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వరకు గుండె సంబంధిత సమస్యలకు పూర్తిగా ఉచితంగా చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. మధురిమా సింగ్ అందించిన పరికరాల ద్వారా ఐసీయూలో ఉన్న చిన్నారులకు మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం కలుగుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు.