
టీటీడీకి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెన్నైకి చెందిన ప్రముఖ రియల్టర్ బాల్ రామజయం భారీ విరాళాన్ని అందజేశారు. సుమారు రూ. 33 లక్షల విలువైన ఐదు బ్యాటరీ బగ్గీలు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) బహూకరించారు. గురువారం తిరుమలలో జరిగిన ప్రత్యేక పూజల అనంతరం ఈ వాహనాలను దేవస్థానానికి అప్పగించారు.
ముందుగా వాహనాలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం దాత బాల్ రామజయం వాహనాల తాళాలను టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా టిటిడి ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ భక్తుల సౌకర్యార్థం ఈ వాహనాలను వినియోగిస్తామని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు సందర్శించే తిరుమల క్షేత్రంలో సామాన్య భక్తులకు మెరుగైన సేవలందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని టిటిడి పేర్కొంది. ఈ విరాళం ద్వారా భక్తుల రవాణా మరింత సులభతరం కానుందని ఆలయ అభివృద్ధికి మద్దతు తెలిపిన బాల్ రామజయంకు దేవస్థానం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
