
టీచర్‌గా మారిన కలెక్టర్.. పదో తరగతి విద్యార్థులకు బోధన
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం ఎడపల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కళాశాలను సందర్శించిన ఆయన, తనిఖీల్లో భాగంగా ఉపాధ్యాయుడి పాత్ర పోషించారు. పాఠశాలను పరిశీలిస్తున్న సమయంలో పదో తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్, విద్యార్థినులకు స్వయంగా ఇంగ్లీష్ పాఠం బోధించారు. పాఠం వివరిస్తూనే విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి, వారి గ్రహణ శక్తిని, అవగాహనను అంచనా వేశారు. తరగతి గదిలో బాలికలు చురుగ్గా పాల్గొనేలా వారిని ఎంతగానో ప్రోత్సహించారు.
విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలను నిశితంగా పరిశీలించిన కలెక్టర్, ఆంగ్ల భాషపై భయం వీడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో కష్టపడి చదివి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు బహుమతులను కూడా అందజేశారు. సాధారణంగా పాఠశాలల నిర్వహణను తనిఖీ చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని, వారు సమగ్రంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ చూపిన ఈ ప్రత్యేక చొరవ స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంది.
