Let's talk: editor@tmv.in
టీఎన్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం: ఈపీఎస్‌

టీఎన్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం: ఈపీఎస్‌

Pinjari Chand
9 ఫిబ్రవరి, 2026

తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్సీ) పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పరిపాలనా సరిగా లేదని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్‌) తీవ్ర విమర్శలు చేశారు. తంజావూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం చెన్నైకి వెళ్లే ముందు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, డీఎంకే ప్రభుత్వం పరిపాలనా సామర్థ్యం లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీఎన్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణలో లోపాలు నెలకొన్నాయని, ఇది అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని అన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికీ శాశ్వత డీజీపీని నియమించలేదని, శాంతిభద్రతల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా డీఎంకే ప్రభుత్వం అమలు చేయలేదని ఈపీఎస్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తరచూ ఆరోపణలు చేస్తున్నారని, కానీ కేంద్రం పథకాల ఆధారంగానే సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా కేంద్రాన్ని సంప్రదించకపోవడం వల్లనే అనేక కేంద్ర పథకాలు తమిళనాడుకు అందలేదని అన్నారు. కేంద్రం నుంచి డీఎంకే తగిన నిధులు, ప్రాజెక్టులు సాధించడంలో విఫలమైందని విమర్శించారు. మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి సరైన డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) సమర్పించకపోవడం వల్లే కేంద్రం ఆ ప్రాజెక్టును రద్దు చేసిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

ఇండియా కూటమి గురించి గతంలో పదేపదే మాట్లాడిన ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఇప్పుడు ఆ ప్రస్తావన చేయడం మానేశారని ఈపీఎస్‌ వ్యాఖ్యానించారు. డీఎంకే–కాంగ్రెస్‌ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తినందునే ఈ పరిస్థితి ఏర్పడిందని, కూటమిలో చీలిక స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఈపీఎస్‌, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కూటములు ఏర్పాటు చేయడం సహజమని అన్నారు. మరికొన్ని పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో అవి కూటమిలో చేరే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ అంశంపై కూడా డీఎంకే ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. పాత పెన్షన్‌ పథకం (ఓపీఎస్‌) కోరితే, ‘అష్యూర్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌’ను ప్రకటించడం, ఏడుస్తున్న పిల్లవాడికి మిఠాయి ఇచ్చినట్టేనని ఎద్దేవా చేశారు.

డీఎంకే ప్రభుత్వం పథకాలకు కొత్త కొత్త పేర్లు పెట్టడంలోనే బిజీగా ఉందని, పథకాల పేర్లకు నోబెల్‌ బహుమతి ఇస్తే అది ముఖ్యమంత్రికే ఇవ్వాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీవీకే నేత విజయ్‌ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ప్రజల మధ్య కనిపించడం లేదని, కరూర్‌ ఘటన తర్వాత 72 రోజుల పాటు ఆయన బయటకు రాకపోవడం రాజకీయ నాయకుడికి విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే ప్రవేశపెట్టిన ‘నడంతై వాజి కావేరి’ పథకాన్ని కేంద్ర నిధులు ఉన్నప్పటికీ డీఎంకే ప్రభుత్వం అమలు చేయడం లేదని, కావాలని ఆలస్యం చేస్తూ కేంద్రంపై నిందలు మోపుతోందని ఈపీఎస్‌ ఆరోపించారు. కష్టపడే పార్టీ కార్యకర్తలకు తప్పకుండా ఎన్నికల్లో అవకాశం ఇస్తామని చెప్పారు. హిందీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న డీఎంకే, అదే హిందీని ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌తో కూటమిలో కొనసాగడం ద్వంద్వ వైఖరేనని విమర్శించారు. డీఎంకే తన ఎన్నికల హామీల్లో కనీసం నాలుగో వంతు కూడా అమలు చేయలేదని అన్నారు. తాను ఇప్పటికే 181 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేశానని, అన్ని పార్టీల కంటే ముందుగానే ఏఐఏడీఎంకే ఎన్నికల ప్రచారం ప్రారంభించిందని తెలిపారు. సెంగొట్టయ్యన్‌ అంశంపై మాట్లాడటం విలువలేనిదని, అది చెల్లని నోట్ల గురించి చర్చించినట్టేనని ఈపీఎస్‌ వ్యాఖ్యానించారు.