
టీఎంసీ ప్రభుత్వం ఎస్ఐఆర్ కు సహకరించాల్సిందే: కిరెన్ రిజిజు
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు న్యాయాధికారులను నియమించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు అత్యంత కీలకమైనవిగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం ఇకపై ఎస్ఐఆర్ కు పూర్తి సహకారం అందించాల్సిందేనని పేర్కొన్నారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ లోకతంత్ర పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాలు అవసరమైనవే. ఇక కాంగ్రెస్, టీఎంసీ రెండూ ఎస్‌ఐఆర్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందే అన్నారు.
సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య కొనసాగుతున్న విభేదాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు శుక్రవారం అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సరిపడా గ్రేడ్-ఏ అధికారులను అందించలేదని గమనించిన కోర్టు, విధుల్లో ఉన్న, జిల్లా మాజీ న్యాయమూర్తులను ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సహాయంగా నియమించాలని ఆదేశించింది.
టీఎంసీపై ఆరోపణలు
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఎంసీ ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని రిజిజు ఆరోపించారు. అక్రమంగా దేశంలోకి చొరబడ్డ వారిని ఓటర్ల జాబితాలో చేర్చి ఎన్నికల్లో విజయం సాధించాలని టీఎంసీ చూస్తోంది. ఇప్పుడు వారి అసలు ఉద్దేశం బయటపడిందని విమర్శించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, 2002 ఓటర్ల జాబితాతో తార్కిక అసమానతలు ఉన్న పేర్లపై దాఖలైన అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు న్యాయాధికారులను నియమించాలి. తల్లిదండ్రుల పేర్లలో తేడాలు, ఓటరు-తల్లిదండ్రుల మధ్య వయస్సు తేడా 15 సంవత్సరాల కంటే తక్కువగా లేదా 50 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం వంటి అంశాలు ఈ అసమానతలలో భాగంగా గుర్తించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచన
ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన న్యాయాధికారులను అందించాలంటూ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్‌ను సుప్రీంకోర్టు కోరింది. సేవలో ఉన్న కొంతమంది న్యాయమూర్తులను , మాజీ న్యాయమూర్తులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించింది. ఇది పశ్చిమ బెంగాల్‌కే కాదు, దేశానికే మంచి వార్త. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ సహా మొత్తం యంత్రాంగం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించాలని రిజిజు స్పష్టం చేశారు.
