Let's talk: editor@tmv.in
టికెట్ ధరలపై విమర్శల నడుమ రికార్డు ప్రైజ్ మనీ ప్రకటించిన ఫిఫా

టికెట్ ధరలపై విమర్శల నడుమ రికార్డు ప్రైజ్ మనీ ప్రకటించిన ఫిఫా

Praveen Kumar
19 డిసెంబర్, 2025

2026 ఫిఫా ప్రపంచకప్ విజేతకు ఈసారి భారీ మొత్తంలో బహుమతి లభించనుంది. ఈ టోర్నీలో గెలిచిన జట్టుకు 5 కోట్ల డాలర్లు, అంటే సుమారు రూ.415 కోట్లు అందుతాయని ఫిఫా ప్రకటించింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచకప్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శల మధ్యే ఫిఫా ఈ రికార్డు స్థాయి బహుమతి మొత్తాలను ప్రకటించడం గమనార్హం.

2022 ఖతర్ ప్రపంచకప్‌లో విజేత అర్జెంటీనాకు 4.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.350 కోట్లు), 2018లో గెలిచిన ఫ్రాన్స్‌కు 3.8 కోట్ల డాలర్లు (సుమారు రూ.315 కోట్లు) లభించాయి. ఆతో పోలిస్తే ఈసారి విజేతకు వచ్చే మొత్తం ఎక్కువే. అయితే, ఇదే సంవత్సరంలో జరిగిన క్లబ్ వరల్డ్ కప్‌లో చెల్సీ జట్టు గెలిచిన బహుమతి మాత్రం దీని కంటే రెండింతలకుపైగా ఉండడం విశేషం. క్లబ్ వరల్డ్ కప్ విజేతగా చెల్సీకి గరిష్ఠంగా 12.5 కోట్ల డాలర్లు, అంటే సుమారు రూ.1,038 కోట్లు లభించాయి.

2026 ప్రపంచకప్‌కు మొత్తం బహుమతి నిధి 65.5 కోట్ల డాలర్లు, అంటే దాదాపు రూ.5,437 కోట్లు. ఇది 2022లోని మొత్తం బహుమతి మొత్తంతో పోలిస్తే దాదాపు 49 శాతం ఎక్కువ. మరోవైపు, 2023లో ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌లో జరిగిన మహిళల ప్రపంచకప్‌కు మొత్తం బహుమతి కేవలం 11 కోట్ల డాలర్లు మాత్రమే. ఈ అసమానతలపై గతంలో విమర్శలు రావడంతో, పురుషులు,మహిళల ప్రపంచకప్‌లకు సమాన బహుమతులు ఇవ్వాలనే లక్ష్యాన్ని ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ప్రకటించారు. మహిళల తదుపరి ప్రపంచకప్ 2027లో బ్రెజిల్‌లో జరగనుంది.

ఈసారి ప్రపంచకప్‌లో పాల్గొనే 48 దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలకు ఫిఫా ముందుగానే నిధులు అందిస్తుంది. ప్రతి దేశానికి సిద్ధం ఖర్చుల కోసం సుమారు రూ.125 కోట్లు, గ్రూప్ దశలో పాల్గొనడానికే మరో రూ.747 కోట్లు ఇవ్వనుంది. ఆ తర్వాత ప్రతి దశ దాటిన కొద్దీ అదనపు మొత్తాలు పెరుగుతాయి. మొత్తం మీద ఫిఫా 48 దేశాలకు కలిపి సుమారు రూ.6,000 కోట్లకు పైగా పంపిణీ చేయనుంది.

ఆ డబ్బును ఆటగాళ్లకు ఎలా పంచుకోవాలన్నది ఆయా దేశాల సమాఖ్యల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, 2022 ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ గెలిచిఉంటే, ప్రతి ఆటగాడికి సుమారు రూ.4.8 కోట్ల బోనస్ వచ్చే అవకాశం ఉండేదని ఫ్రాన్స్ క్రీడా పత్రికలు అప్పట్లో తెలిపాయి.

క్లబ్ టోర్నీలు, జాతీయ జట్ల టోర్నీల మధ్య బహుమతి మొత్తాల్లో పెద్ద తేడా ఉండడానికి కారణం వేర్వేరు ఆర్థిక విధానాలే అని ఫిఫా చెబుతోంది. క్లబ్‌లకు ఆటగాళ్ల జీతాలు ఎక్కువగా ఉండటం, టీవీ హక్కులు, స్పాన్సర్ల ద్వారా అధిక ఆదాయం రావడం వల్ల అక్కడ బహుమతులు భారీగా ఉంటాయని వివరణ ఇస్తోంది. యూరప్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. యూరో కప్ గెలిచిన జట్టుకు దక్కే మొత్తం కంటే, ఛాంపియన్స్ లీగ్ విజేతకు వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది.

ప్రపంచకప్ ద్వారా వచ్చే ఆదాయంలో ఒక భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభివృద్ధికి వినియోగిస్తామని ఫిఫా చెబుతోంది. చిన్న దేశాల్లో మౌలిక వసతులు, యువ ఆటగాళ్ల శిక్షణ, గ్రాస్‌రూట్ స్థాయి అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఇన్ఫాంటినో అన్నారు. 2026 వరల్డ్ కప్ ద్వారా ప్రపంచ ఫుట్‌బాల్ సమాజానికి ఇది ఆర్థికంగా ఒక కీలక మలుపు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.