Let's talk: editor@tmv.in
టార్గెట్ హిడ్మా

టార్గెట్ హిడ్మా

FL - TRND
18 అక్టోబర్, 2025

భారతదేశ మావోయిస్టు చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రూపేశ్ అలియాస్ సతీష్‌తో సహా ఏకంగా 208 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మరోవైపు, ఈ విజయాల పరంపరలో కేంద్రం ముందున్న అతిపెద్ద సవాలు.. అత్యంత కీలక మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మాను పట్టుకోవడం.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ లొంగుబాటు

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో బస్తర్ జిల్లాలోని జగదల్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సమక్షంలో ఈ లొంగుబాటు కార్యక్రమం శుక్రవారం జరిగింది. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు రూపేశ్ అలియాస్ సతీష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్ అలియాస్ రాజ్‌మన్ మాండవి, రనిత, రాజు సలాం వంటి కీలక నేతలతో పాటు 21 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 61 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు.

ఆయుధాల అప్పగింత

నక్సలైట్లు తమ వద్ద ఉన్న 153 ఆయుధాలను అప్పగించారు. ఇందులో 19 ఏకే 47 రైఫిళ్లు, 17 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 23 ఇన్సాస్ రైఫిళ్లు వంటి భారీ ఆయుధాలు ఉన్నాయి. ఈ లొంగుబాటుతో మావోయిస్టుల కంచుకోటగా పేరున్న అభూజ్‌మఢ్ ఖాళీ అయ్యిందని, ఉత్తర బస్తర్ ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న 'రెడ్ టెర్రర్' అంతమైందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణ బస్తర్ ప్రాంతంలో మాత్రమే మావోయిస్టుల జాడ మిగిలి ఉందని తెలిపారు.

రూపేశ్ సందేశం

లొంగుబాటుకు ముందు రూపేశ్ తన సహచరులకు భావోద్వేగ సందేశం ఇచ్చారు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి దీనిని దేశానికే చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. ఆయుధాలు వదిలి లొంగిపోయేవారికి ప్రభుత్వం నైపుణ్యం, పునరావాసం కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ భారీ లొంగుబాటుకు కేవలం రెండు రోజుల ముందు, మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి కూడా తన 60 మంది అనుచరులతో మహారాష్ట్రలోని గడ్చిరోలీలో లొంగిపోవడం గమనార్హం.

మావోయిస్టుల లొంగుబాటుకు కారణాలు

గతంలో అణగారిన వర్గాల్లో 'అడవుల నుంచి అన్నలు వస్తారు' అనే ఆశ ఉండేది. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీని ఎదిరిస్తూ, గిరిజనుల భూమి రక్షణ కోసం మావోయిస్టులు చేసిన పోరాటాలు చరిత్రలో ముద్ర వేశాయి. కానీ, కాలం గడిచేకొద్దీ ఆ ధ్యేయం మసకబారి, పోరాటం రక్తపు చరిత్రగా మారింది. ప్రస్తుత లొంగుబాటుకు ప్రధానంగా కింది అంశాలు దోహదపడ్డాయి

ఆపరేషన్ కగార్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఆపరేషన్ కగార్ వంటి చర్యలను తీవ్రతరం చేశాయి. దండకారణ్యం, ఏవోబీ, తెలంగాణ, జార్ఖండ్‌లలో భద్రతా దళాలు (గ్రేహౌండ్స్, ఆక్టోపస్) కార్యకలాపాలను ముమ్మరం చేయడంతో మావోయిస్టులకు తట్టుకోవడం కష్టమైంది.

ప్రభుత్వ పునరావాస విధానాలు: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీని అమలు చేస్తున్నాయి. దీని కింద లొంగిపోయిన వారికి ఎక్స్-గ్రేషియా (తక్షణ నగదు సాయం), నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కోసం రుణాలు అందించి సాధారణ జీవితానికి అవకాశం కల్పిస్తున్నాయి.

అంతర్గత విభేదాలు: సాయుధ పోరాటం ద్వారా విజయం అసాధ్యమని చాలా మంది కేడర్‌కు నమ్మకం ఏర్పడటం, నాయకత్వ శూన్యత, అగ్ర నాయకుల వేధింపులు, అంతర్గత కలహాలు వంటివి లొంగుబాటుకు దారితీశాయి.

ప్రజల మద్దతు కోల్పోవడం: ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు (ఆధార్, పీసా చట్టం) ప్రజల్లోకి వెళ్లడం, మావోయిస్టు నాయకత్వం వాటిని వ్యతిరేకించడం వల్ల గిరిజనుల మద్దతు తగ్గింది. ప్రజా సమస్యలు తుపాకీ మోతల్లో వినిపించకుండా పోవడం కూడా ఈ బలహీనతకు కారణమైంది.

ప్రభుత్వ లక్ష్యం.. హిడ్మాను పట్టుకోవడం

కేంద్ర హోం మంత్రి ప్రకటించినట్లుగా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుదిముట్టిస్తామనే లక్ష్యం వైపు ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అయితే, మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగియాలంటే, భద్రతా దళాల ముందున్న అతిపెద్ద లక్ష్యం మడావి హిడ్మా.

హిడ్మా పాత్ర: హిడ్మా ప్రస్తుతం పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ కంపెనీకి కమాండర్‌గా ఉన్నారు. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ, సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో వంటి కీలక విభాగాలకు ఆయన రక్షణ కల్పిస్తున్నారు. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉంది.

2013లో సల్వాజుడుం సృష్టికర్త మహేంద్ర కర్మను టార్గెట్ చేసి సుక్మా జిల్లా ధర్మా లోయలో జరిగిన దాడిలో (27 మంది మృతి), 2021 ఏప్రిల్‌లో బీజాపూర్‌ జిల్లాలో 22 మంది జవాన్లు మృతిచెందిన అంబూష్‌లో, 2023లో 10 మంది డీఆర్‌జీ జవాన్లు మరణించిన ఐఈడీ దాడిలో హిడ్మా కీలకపాత్ర పోషించారు.

హిడ్మాను పట్టుకోవడం చాలా కష్టమంటారు. ఆయనకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది (దగ్గరగా టీమ్-Aలో 10, మధ్యలో టీమ్-Bలో 20, వెలుపల 15 మంది). ఆయన ప్రత్యేక క్యాంపులో ఉండటం, సాధారణ కేడర్‌కు కూడా ఆరు నెలలకోసారి మాత్రమే కనిపించడం వంటివి ఆయన భద్రతా జాగ్రత్తలను సూచిస్తాయి.

హిడ్మా వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, రాజకీయ విభాగం కంటే సైనిక విభాగంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందుకే ఆయనను పట్టుకోవడానికి స్పెషల్‌ ఆపరేషన్‌ ఏడాది కాలంగా ఉదృతంగా సాగుతోంది. మొత్తంగా, భద్రతా దళాల ఒత్తిడి, పునరావాస పథకాల ఆకర్షణతో మావోయిస్టు పార్టీ కేడర్ కకావికలమవుతున్నప్పటికీ, మడావి హిడ్మా లెక్క తేలిస్తేనే మావోయిస్టు ఉద్యమ అధ్యాయం ముగిసినట్లు అవుతుందని కేంద్ర హోంశాఖ బలంగా భావిస్తోంది.

టార్గెట్ హిడ్మా - Tholi Paluku