Let's talk: editor@tmv.in
టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ విజేత అబ్దుసత్తోరోవ్

టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ విజేత అబ్దుసత్తోరోవ్

Pinjari Chand
3 ఫిబ్రవరి, 2026

ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నోడిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చివరి రౌండ్‌లో నల్ల పావులు ఆడిన అబ్దుసత్తోరోవ్, ఫామ్‌లో లేని భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసిపై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచాడు.ఈ టోర్నీలో భారత ఆటగాళ్లలో ప్రపంచ చాంపియన్ డి. గుకేశ్ ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కైమర్‌తో గుకేశ్ డ్రా చేసుకున్నాడు. మొత్తం 6.5 పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయితే ఈ ప్రదర్శనతో గుకేశ్ రేటింగ్ 2750 మార్క్‌కు దిగువకు పడిపోయింది. ఆర్. ప్రజ్ఞానంద చివరి రౌండ్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు జోర్డెన్ వాన్ ఫోరెస్ట్‌తో డ్రా ఆడి 5.5 పాయింట్లతో టోర్నీని ముగించాడు. రాబోయే కాండిడేట్స్ టోర్నీకి ముందు భారత ఆటగాళ్లు ఈ పోటీలోని అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర్జున్ ఇరిగేసికి ఈ టోర్నీ తీవ్ర నిరాశను మిగిల్చింది. అతను మొత్తం 29 రేటింగ్ పాయింట్లు కోల్పోయి, ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్‌ నుంచి బయటకు వెళ్లాడు. ప్రస్తుతం లైవ్ రేటింగ్స్‌లో టాప్-10లో ఉన్న ఏకైక భారత ఆటగాడు గుకేశ్ మాత్రమే. ఆశ్చర్యకరంగా, 2750కు పైగా రేటింగ్ ఉన్న భారత ఆటగాడు ఈ సమయంలో ఎవరూ లేరు.

13 గేమ్‌లలో 9 పాయింట్లు సాధించిన అబ్దుసత్తోరోవ్ అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్నాడు. అతని జూనియర్ సహచరుడు, వరల్డ్ కప్ విజేత జవోఖిర్ సిందారోవ్ 8.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.జోర్డెన్ వాన్ ఫోరెస్ట్, విన్సెంట్ కైమర్, అమెరికా ఆటగాడు హాన్స్ నీమన్ ముగ్గురూ 7.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకున్నారు. జర్మనీకి చెందిన మాథియాస్ బ్లూబౌమ్, టోర్నీలో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల టర్కీ ఆటగాడు యాగిజ్ కాన్ ఎర్డోగ్మస్ 7 పాయింట్లతో తదుపరి స్థానాల్లో నిలిచారు. భారత ఆటగాళ్లలో అర్వింద్ చితంబరం, అర్జున్ ఇరిగేసి ఇద్దరూ 4.5 పాయింట్లతో పట్టిక చివరి భాగంలో నిలిచారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన థాయ్ డై వాన్ న్యూగెన్ కేవలం 3 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాడు.