Let's talk: editor@tmv.in
టాటా స్టీల్ చెస్ టోర్నీలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు

టాటా స్టీల్ చెస్ టోర్నీలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు

Pinjari Chand
25 జనవరి, 2026

ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్ శనివారం టాటా స్టీల్ చెస్ టోర్నీలో జరిగిన ఆరో రౌండ్‌లో ఊహించని తప్పిదం చేయడంతో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నోదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ‘బ్లైండ్ స్పాట్’ కారణంగా డ్రాగా నిలిచే అవకాశమున్న స్థితిలో గుకేష్ భారీ పొరపాటు చేసి వెంటనే గేమ్ ను వదిలేశాడు. చెస్‌లో కొన్ని క్షణాల పాటు ప్రత్యర్థి మూవ్స్ ను గుర్తించలేని పరిస్థితిని ‘బ్లైండ్ స్పాట్’గా పేర్కొంటారు. గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగిన తర్వాత గుకేష్‌కు ఇది మొదటి సారి ఎదురైన అనుభవం. అభిమానులు ఇది చివరిసారి కావాలని ఆశిస్తున్నారు.

ఇదే రౌండ్‌లో టాప్ సీడ్ భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగేశి అదృష్టవశాత్తు ఓటమి నుంచి తప్పించుకున్నాడు. జర్మనీకి చెందిన మాథియాస్ బ్లూబౌమ్పై ఓడిపోయే స్థితిలో ఉన్న అర్జున్‌కు, ప్రత్యర్థి చేసిన చిన్న తప్పిదం ఊరటనిచ్చింది. ఫలితంగా ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

భారత ఆటగాడు ఆర్. ప్రగ్నానందాకు ఇప్పటికీ విజయం అందని పరిస్థితి కొనసాగుతోంది. ఆరో రౌండ్‌లో ఆయన స్లోవేనియాకు చెందిన వ్లాదిమిర్ ఫెడోసేవ్తో డ్రా చేసుకున్నాడు. మరో కీలక పోరులో ఉజ్బెకిస్తాన్ వరల్డ్‌కప్ విజేత జావోఖిర్ సిందారోవ్పై భారత గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చితంబరం గట్టి పోటీ ఇచ్చి డ్రాతో సరిపెట్టుకున్నాడు. ఇంకా ఏడు రౌండ్లు మిగిలి ఉండగా, అబ్దుసత్తోరోవ్ 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత సిందారోవ్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అమెరికాకు చెందిన హాన్స్ మొక్ నియమాన్, జర్మనీ ఆటగాడు విన్సెంట్ కైమర్ చెరో 3.5 పాయింట్లతో మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు. గుకేష్, అర్జున్ సహా పలువురు ఆటగాళ్లు వీరి వెనుక ఉన్నారు.

6వ రౌండ్ ఫలితాలు:

నోదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్, 4.5) – డి. గుకేష్ (భారత్, 3)పై విజయం

ఆర్. ప్రగ్నానందా (భారత్, 2) – వ్లాదిమిర్ ఫెడోసేవ్ (స్లోవేనియా, 3.5) డ్రా

మాథియాస్ బ్లూబౌమ్ (జర్మనీ, 3) – అర్జున్ ఎరిగైసి (భారత్, 2.5) డ్రా

అరవింద్ చితంబరం (భారత్, 2) – జావోఖిర్ సిందారోవ్ (ఉజ్బెకిస్తాన్, 4) డ్రా

విన్సెంట్ కైమర్ (జర్మనీ, 3.5) – హాన్స్ మొక్ నియమాన్ (అమెరికా, 3.5)పై విజయం

యాగిజ్ కాన్ ఎర్డోగ్మస్ (టర్కీ, 3) – జోర్డెన్ వాన్ ఫోరెస్ట్ (నెదర్లాండ్స్, 3)పై విజయం

థాయ్ డై వాన్ నుగ్యెన్ (చెక్ రిపబ్లిక్, 2) – అనీష్ గిరి (నెదర్లాండ్స్, 1.5) డ్రా