Let's talk: editor@tmv.in
టాటా సన్స్‌ చైర్మన్‌ పదవికి చంద్రశేఖరన్‌ గుడ్‌బై

టాటా సన్స్‌ చైర్మన్‌ పదవికి చంద్రశేఖరన్‌ గుడ్‌బై

Pinjari Chand
13 ఆగస్టు, 2026

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనున్న నేపథ్యంలో..టాటా గ్రూప్‌కు తన పదవీ కాలం తరువాత గుడ్‌బై చెప్పనున్నారు. మరోసారి ఛైర్మన్‌గా కొనసాగేందుకు తనను తాను ప్రతిపాదించుకోకూడదని నిర్ణయించుకున్నారు. తదుపరి పదవీకాలం పొడిగింపుపై టాటా సన్స్‌ బోర్డులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌, సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌లు చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలాన్ని ఏకగ్రీవంగా పొడిగించాలని సిఫార్సు చేశాయి. టాటా సన్స్‌ నామినేషన్‌, రెమ్యునరేషన్‌ కమిటీతో పాటు బోర్డు కూడా ఈ ప్రతిపాదనను సిఫార్సు చేసింది. అయితే 2026 ఫిబ్రవరి 24న జరిగిన బోర్డు సమావేశంలో ఓ సభ్యుడు ప్రతిపాదనకు మద్దతు ఇవ్వకపోవడంతో అది ఆమోదం పొందలేదు. ఈ నిర్ణయంపై ఆరు నెలలుగా ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని చంద్రశేఖరన్‌ తెలిపారు. టాటా సన్స్‌ కీలక వ్యూహాత్మక ప్రాజెక్టులను అమలు చేస్తున్న నేపథ్యంలో సంస్థ భవిష్యత్‌ నాయకత్వంపై స్పష్టత ఉద్యోగులు, పెట్టుబడిదారులు, భాగస్వాములకు అవసరమని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తన పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి నియమించుకోవాలని కోరుకోవడం లేదని బోర్డుకు తెలియజేసినట్లు వెల్లడించారు. తదుపరి ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియను త్వరగా ప్రారంభించి, సజావుగా నాయకత్వ మార్పు జరిగేలా చూడాలని బోర్డును కోరారు. టాటా గ్రూప్‌లో తన 40 ఏళ్ల ప్రొఫెషనల్‌ జీవితాన్ని పూర్తి చేసుకున్నానని చంద్రశేఖరన్‌ తెలిపారు. గత దశాబ్ద కాలంగా టాటా సన్స్‌కు నాయకత్వం వహించడం తనకు ఎంతో గౌరవం, బాధ్యతతో కూడిన అనుభవమని పేర్కొన్నారు.

పుకార్లు, కుట్రలను పట్టించుకోవద్దు: సిబ్బందికి చంద్రశేఖరన్‌ సూచన

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా తన పదవీకాలం 2027 ఫిబ్రవరితో ముగిసిన తర్వాత మరోసారి పదవిలో కొనసాగబోనని ప్రకటించిన ఎన్‌. చంద్రశేఖరన్‌.. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలు, పుకార్లు, కుట్ర సిద్ధాంతాలను పట్టించుకోవద్దని టాటా గ్రూప్‌ ఉద్యోగులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం బాంబే హౌస్‌లో నిర్వహించిన టౌన్‌హాల్‌ సమావేశంలో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. టాటా గ్రూప్‌లో తాను గడిపిన నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్లుగా ఉద్యోగులు తనపై చూపిన ప్రేమ, ఆప్యాయత తనను ఎంతో కదిలించిందని తెలిపారు. 2027 ఫిబ్రవరి తర్వాత టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మరోసారి నియమితులు కావాలని నేను కోరుకోవడం లేదు. నా ప్రస్తుత పదవీకాలం అప్పటితో ముగుస్తుందని ఉద్యోగులకు తెలిపారు.

టాటా గ్రూప్‌లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రశేఖరన్‌.. తన కెరీర్‌ ఇంత దూరం వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదని అన్నారు. అయితే ప్రతి ఒక్కరి కెరీర్‌కు ఏదో ఒక సమయంలో ముగింపు ఉంటుందని, తన తర్వాత మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. టాటా అనేది ఎంతో గౌరవనీయమైన పేరు. మీలాంటి ఉద్యోగుల కృషి వల్లే ఆ పేరు ఇంత గొప్పగా నిలిచిందని కొనియాడారు. టాటా గ్రూప్‌ భవిష్యత్తులోనూ పురోగతి సాధిస్తుందని, సంస్థలో ఉద్యోగులకు అవకాశాలు కొనసాగుతాయని చంద్రశేఖరన్‌ భరోసా ఇచ్చారు. చివరగా వ్యక్తిగత అంశాలను ప్రస్తావించిన ఆయన.. అప్పుడప్పుడు జరిగే అనధికారిక లేదా గ్రూప్‌ సమావేశాల ద్వారా కాకుండా మరింత మంది ఉద్యోగులను వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఉందని అన్నారు. సమావేశం ముగించుకుని చంద్రశేఖరన్‌ వెళ్లే సమయంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున చప్పట్లతో వీడ్కోలు పలికారు.

టాటా షేర్లకు నష్టాలు

చంద్రశేఖరన్‌ రెండోసారి పదవిలో కొనసాగబోనన్న ప్రకటన ప్రభావం టాటా గ్రూప్‌ కంపెనీల షేర్లపై కనిపించింది. బుధవారం టాటా గ్రూప్‌కు చెందిన పలు లిస్టెడ్‌ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్‌ షేరు 3.71 శాతం పడిపోయి రూ.2,349 వద్ద ముగిసింది. టాటా టెక్నాలజీస్‌ 2.67 శాతం, నెల్కో 2.11 శాతం, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ 1.49 శాతం, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ 1.31 శాతం చొప్పున క్షీణించాయి. టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, టైటాన్‌, టాటా కమ్యూనికేషన్స్‌, ట్రెంట్‌, టాటా పవర్‌ షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి. అయితే అన్ని టాటా గ్రూప్‌ షేర్లు నష్టపోలేదు. టాటా కెమికల్స్‌ 0.53 శాతం, వోల్టాస్‌ 0.98 శాతం, టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ 1.59 శాతం లాభపడ్డాయి. చంద్రశేఖరన్‌ నిర్ణయంతో ఇప్పుడు టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ ఎవరన్న అంశంపై దృష్టి నెలకొంది. 2027 ఫిబ్రవరి 20న ఆయన ప్రస్తుత పదవీకాలం అధికారికంగా ముగియనుంది.

టాటా సన్స్‌ చైర్మన్‌ పదవికి చంద్రశేఖరన్‌ గుడ్‌బై - Tholi Paluku