
టాటా గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సు సందర్భంగా టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’, ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిశ్రమలకు అనుకూల వాతావరణం గురించి టాటా చైర్మన్‌కు వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను కూడా సీఎం సమగ్రంగా వివరించారు.
భవిష్యత్‌ను ముందే అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా ఆలోచించే తెలంగాణ ప్రభుత్వ దృక్పథాన్ని టాటా చైర్మన్ చంద్రశేఖరన్ ప్రశంసించారు. పెట్టుబడుల కోసమే కాకుండా, రాష్ట్ర విధానాలు, విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ముందుకు సాగుతోందని ఆయన అభినందించారు. ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి
హైదరాబాద్‌లోని ప్రధాన క్రీడా మైదానాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలను సీఎం టాటా చైర్మన్‌తో పంచుకున్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వంతో భాగస్వామ్యంగా పనిచేయడానికి టాటా గ్రూప్ సిద్ధంగా ఉందని చంద్రశేఖరన్ తెలిపారు. 2036 ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు సాధించడమే లక్ష్యంగా, స్టేడియాల అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని, అయితే వారికి తగిన స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత
యువత నైపుణ్యాల అభివృద్ధిపై కూడా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంలో టాటా టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ సెంటర్లుగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరించారు. ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
అలాగే, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనలు, 2036 ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు సాధించేలా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను సీఎం వివరించారు. హైదరాబాద్‌లో చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా చైర్మన్ ప్రత్యేక ఆసక్తి చూపారు అని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
