
టాంజానియా అధ్యక్షురాలిగా సామియా సులుహు హసన్ ప్రమాణ స్వీకారం
తీవ్ర వివాదాలకు, హింసాత్మక నిరసనలకు దారి తీసిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల మధ్య టాంజానియా అధ్యక్షురాలిగా సామియా సులుహు హసన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ప్రధాన ప్రతిపక్ష నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడం, భారీ అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.
నవంబర్ 1న ప్రకటించిన అధికారిక ఫలితాల ప్రకారం, అధ్యక్షురాలు హసన్ 97 శాతం పైగా ఓట్లను సాధించి ఘన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలు పోటీ కాదని, నిజమైన ఎన్నికలు టాంజానియాలో జరగలేదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన చడెమా ఖండించింది. ఆ పార్టీ ప్రధాన నేత టుండు లిస్సు ఎన్నికల సంస్కరణలు కోరినందుకు రాజద్రోహం కేసులో జైలు పాలయ్యారు మరో ప్రతిపక్ష నాయకుడు లుహాగా మ్పినా (వజలెండో పార్టీ)ను పోటీ నుంచి తప్పించారు.
అక్టోబర్ 29న ఎన్నికల రోజు నుంచే ముఖ్య నగరాల్లో భారీ నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు పోస్టర్లను చించేయడం, పోలీసులతో ఘర్షణకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ హింసను అణచివేయడానికి సైన్యాన్ని మోహరించారు. అధికారికంగా మరణాల సంఖ్యను ప్రభుత్వం వెల్లడించనప్పటికీ, జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయ ప్రతినిధి సీఫ్ మగాంగో ప్రకారం, దార్ ఈస్ సలామ్, షిన్యాంగా, మోరోగోరో ప్రాంతాల్లో కనీసం 10 మంది మరణించినట్లు విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు.
హసన్ ప్రమాణ స్వీకారం
నిరసనల కారణంగా రాజధాని దార్ ఎస్ సలాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పరిపాలనా రాజధాని దొడోమాలోని ప్రభుత్వ ప్రాంగణంలో అతిథుల సమక్షంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మొజాంబిక్, జాంబియా, బురుండి, సోమాలియా అధ్యక్షులు ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు. గతంలోలా ప్రజలతో కిక్కిరిసిన ఫుట్‌బాల్ స్టేడియంలో కాకుండా ఈసారి పరిమితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షురాలు హసన్ దేశంలో జరిగిన ప్రాణనష్టంపై స్పందించారు. అయితే, ఈ నిరసనలకు విదేశీయులే కారణమని ఆమె ఆరోపించారు. ఆమె దేశాన్ని "ఐక్యం" చేస్తానని, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలని భద్రతా సంస్థలను కోరారు.
నిలిచిపోయిన కార్యకలాపాలు
ఎన్నికల అనంతర హింస కారణంగా దార్ ఎస్ సలాంలో అనేక పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. ఇంటర్నెట్ సేవలు తరచుగా నిలిపివేయబడటంతో ప్రజల సాధారణ కార్యకలాపాలు, ప్రయాణాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగానే నవంబర్ 3న తిరిగి ప్రారంభం కావాల్సిన యూనివర్సిటీలను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. టాంజానియాలో ఈ హింస, ప్రతిపక్ష అణచివేత కొనసాగుతుండటంతో, కెన్యా వంటి పొరుగు దేశాల అధ్యక్షులు శాంతిని కాపాడాలని, సంభాషణల ద్వారా సమస్యను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. కెన్యా అధ్యక్షుడు విలియం రుటో టాంజానియన్లు శాంతిని కాపాడాలని, దేశ స్థిరత్వం కోసం అన్ని వర్గాల మధ్య చర్చలు జరగాలని పిలుపునిచ్చారు.
టాంజానియాలో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా, నమంగా వద్ద ఉన్న టాంజానియా-కెన్యా సరిహద్దు మార్గం మూతపడింది. దీంతో, ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సరిహద్దు మూసివేతతో, వ్యవసాయ ఉత్పత్తులతో లోడ్ చేసిన ట్రక్కులు ఆరు రోజులుగా నమంగా వద్ద నిలిచిపోయాయి. ఈ మార్గం తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో ఒకటి. సరిహద్దు మూసివేత వల్ల కెన్యా, టాంజానియా మాత్రమే కాకుండా ఇతర పొరుగు దేశాల మధ్య కూడా వాణిజ్య రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
