Let's talk: editor@tmv.in
టర్క్‌మన్ గేట్ కూల్చివేతతో ఢిల్లీలో ఉద్రిక్తత

టర్క్‌మన్ గేట్ కూల్చివేతతో ఢిల్లీలో ఉద్రిక్తత

Pinjari Chand
8 జనవరి, 2026

టర్క్‌మన్ గేట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కూల్చివేత చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరగడంతో సుమారు ఐదుగురు పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. డీసీపీ నిధిన్ వల్సన్ మాట్లాడుతూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున సుమారు 1 గంటకు కూల్చివేత ప్రారంభమైందని చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని అసాంఘిక శక్తులు పోలీసులపై రాళ్లు విసరగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తక్కువ స్థాయిలో బలప్రయోగం చేసినట్లు తెలిపారు. మొత్తం ప్రక్రియ ప్రశాంతంగానే సాగిందని, గాయపడిన పోలీసులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని స్పష్టం చేశారు. సీసీటీవీ, బాడీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సెంట్రల్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుర్ వర్మ మాట్లాడుతూ కూల్చివేత సమయంలో కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయితే పోలీసులు సమయోచితంగా, పరిమిత స్థాయిలో బలప్రయోగంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి శాంతిభద్రతలను పునరుద్ధరించారని చెప్పారు.

సిటీ ఎస్పీ జోన్ (సీఎస్పీజెడ్ ) డిప్యూటీ కమిషనర్ వివేక్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం కోర్టు ఆదేశాల మేరకు రాత్రిపూట కూల్చివేత చేపట్టారు. సుమారు 4,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న అక్రమ నిర్మాణాలను 32 జేసీబీల సహాయంతో కూల్చివేశారు. కూల్చివేత అనంతరం మల్బా(శిథిలాలు)ను తొలగించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాళ్లదాడిలో ఎవరికి తీవ్రమైన గాయాలు కాలేదని, పోలీసులు సమర్థంగా పరిస్థితిని నియంత్రించారని ఆయన పేర్కొన్నారు. పోలీసుల ప్రకారం ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. కూల్చివేత సజావుగా పూర్తయ్యేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తొమ్మిది జోన్లుగా విభజన

ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు సమీపంలోని టర్క్‌మన్ గేట్–రామ్‌లీలా మైదాన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు అధికారిక ప్రకటనలో తెలిపారు. కూల్చివేత సమయంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఆ ప్రాంతాన్ని తొమ్మిది జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌ను అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. కూల్చివేతకు ముందు అమన్ కమిటీ సభ్యులు, స్థానికులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ కొన్ని అసాంఘిక శక్తులు రాళ్లదాడికి పాల్పడగా, పరిస్థితిని వేగంగా అదుపులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. న్యాయస్థాన ఆదేశాలను చట్టబద్ధంగా, వృత్తిపరంగా సున్నితంగా అమలు చేస్తూనే శాంతిభద్రతలు కాపాడటానికి ఢిల్లీ పోలీసులు కట్టుబడి ఉన్నారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కూల్చివేత కోసం సుమారు 17 బుల్డోజర్లను వినియోగించినట్లు అధికారులు తెలిపారు.

టర్క్‌మన్ గేట్ కూల్చివేత అక్రమం.. వక్ఫ్ భూమిపై చర్యలు – ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్

టర్క్‌మన్ గేట్ సమీపంలోని ఫైజ్-ఎ-ఎలాహీ మసీదు వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు చట్టవిరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించారు. ఈ భూమి వక్ఫ్‌కు చెందిన 123 ఆస్తుల్లో భాగమని, అయినప్పటికీ అక్రమంగా కూల్చివేత చేపట్టారని ఆయన తెలిపారు. ఈ విధంగా దేశమంతటా, ఢిల్లీలో సామరస్య వాతావరణాన్ని చెడగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా వచ్చి ఇది అక్రమ నిర్మాణమని చెబితే, వెంటనే ఎంసీడీ కూల్చివేస్తోందని అన్నారు.

వక్ఫ్‌కు చెందిన షాదీఖానా, డిస్పెన్సరీ ప్రజలకు సేవలు అందిస్తున్నాయని, మసీదు సమీపంలో ఉన్న భూమి, ఖబ్రస్థాన్ భూమిని కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. అనంతరం రాళ్లదాడి జరిగిందని చెబుతూ, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం, ప్రజలను జైలుకు పంపడం జరుగుతోందని విమర్శించారు.

స్వాగతిస్తున్నాం.. కానీ ఒకే మతం లక్ష్యంగా ఉండకూడదు

కాంగ్రెస్ నాయకుడు సందీప్ దిక్షిత్ టర్క్‌మన్ గేట్ వద్ద చేపట్టిన కూల్చివేత చర్యలను స్వాగతించారు. అక్రమ నిర్మాణాల తొలగింపే లక్ష్యమైతే ఇది మంచి చర్యేనని పేర్కొన్నారు. అయితే ఒకే మతాన్ని లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. అధికారులపై హింసకు పాల్పడటం మాత్రం సరైంది కాదని, అధికారులు కోర్టు, ఎంసీడీ ఆదేశాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

కూల్చివేత సమయంలో రాళ్లదాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 25 నుంచి 30 మంది పోలీసులు, సిబ్బందిపై రాళ్లు విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని, వారిని సమీప ఆసుపత్రిలో చికిత్స అందించామని సెంట్రల్ జిల్లా డీసీపీ నిధిన్ వల్సన్ తెలిపారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించాలి – అసదుద్దీన్ ఓవైసీ

టర్క్‌మన్ గేట్ సమీపంలోని ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ చేపట్టిన కూల్చివేత చర్యలను ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కూల్చివేతలో విధివిధాన లోపాలు ఉన్నాయని, వక్ఫ్ ఆస్తికి నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ భూమి మొత్తం వక్ఫ్‌కు చెందినదే. నవంబర్ 12న ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ‘సేవ్ ఇండియా ఫౌండేషన్’ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు సర్వేకు ఆదేశాలు ఇచ్చినా, ఈ కేసులో వక్ఫ్ ప్రతి వాదిగా లేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఢిల్లీ వక్ఫ్ బోర్డు తప్పనిసరిగా ప్రతివాదిగా ఉండాల్సిందని, హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాల్సిందని ఓవైసీ అన్నారు. అది జరగకపోవడంతో కోర్టు తప్పు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు.

భూమి వివాదానికి చారిత్రక నేపథ్యం ఉందని పేర్కొన్న ఓవైసీ, 1947 నాటికే అక్కడ మసీదు ఉంది. పార్లమెంట్ ఆమోదించిన ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్–1991’ను పూర్తిగా పక్కన పెట్టారు. వక్ఫ్‌కు భారీ నష్టం జరిగింది. జరిగినది తప్పు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు, దాని నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించి అన్ని వాస్తవాలను వివరించి యథాస్థితి (స్టేటస్ క్వో) ఉత్తర్వులు పొందాలని సూచించారు.

ఇదే సమయంలో, 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంపై కూడా ఓవైసీ స్పందించారు. ఈ ఇద్దరికీ ఇప్పటికీ బెయిల్ లభించకపోవడం ఆశ్చర్యకరం, షాకింగ్ కూడా అని అన్నారు. అయితే అదే కేసులో గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

టర్క్‌మన్ గేట్ కూల్చివేతతో ఢిల్లీలో ఉద్రిక్తత - Tholi Paluku