Let's talk: editor@tmv.in
టర్కీలో ఘోర విమాన ప్రమాదం: లిబియా సైన్యాధిపతి సహా 8 మంది మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం: లిబియా సైన్యాధిపతి సహా 8 మంది మృతి

Shaik Mohammad Shaffee
25 డిసెంబర్, 2025

టర్కీ రాజధాని అంకారా సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో లిబియా సైన్యాధిపతి మొహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్ సహా మొత్తం 8 మంది మృతి చెందారు. ఈ ఘటనను లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ ద్బీబెహ్ దురదృష్టకర ప్రమాదంగా పేర్కొన్నారు. టర్కీ పర్యటన ముగించుకుని లిబియాకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ఈ ప్రమాదంలో అల్-హద్దాద్‌తో పాటు లిబియా గ్రౌండ్ ఫోర్సెస్ చీఫ్ అల్-ఫితౌరి ఘరబిల్, మిలిటరీ మాన్యుఫాక్చరింగ్ అథారిటీ డైరెక్టర్ మహ్మూద్ అల్-కతావి, అల్-హద్దాద్‌కు సలహాదారు మొహమ్మద్ అల్-అసావి దియాబ్, అలాగే ఒక సైనిక ఫోటోగ్రాఫర్ మొహమ్మద్ ఒమర్ అహ్మద్ మహ్జూబ్ మృతి చెందారు. అలాగే విమాన సిబ్బందిలోని ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు.

టర్కీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఫాల్కన్-50 రకం ప్రైవేట్ జెట్ అంకారా ఎసెన్‌బొగా విమానాశ్రయం నుంచి మంగళవారం రాత్రి 8:30కి బయలుదేరింది. సుమారు 40 నిమిషాల తర్వాత విమానంలో ఎలక్ట్రికల్ లోపం ఉందని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చి అత్యవసర ల్యాండింగ్ కోరారు. విమానాన్ని తిరిగి అంకారాకు మళ్లించినప్పటికీ, ల్యాండింగ్‌కు దిగుతున్న సమయంలో రాడార్ నుంచి విమానం మాయమైపోయింది.

తర్వాత అంకారాకు దక్షిణంగా సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న హయ్మానా ప్రాంతంలోని కేసిక్కవాక్ గ్రామం సమీపంలో విమాన శకలాలు గుర్తించారు. భారీ వర్షం, మబ్బుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినప్పటికీ, సహాయక బృందాలు శిథిలాల వద్ద గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. ప్రమాద స్థలాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకొని, విపత్తు నిర్వహణ సంస్థ ఏఎఫ్ఏడీని రంగంలోకి దించింది.

ప్రాథమిక దర్యాప్తులో ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని, ఎలాంటి కుట్ర లేదని అధికారులు తెలిపారు. విమానంలోని బ్లాక్ బాక్స్‌లు (ఫ్లైట్ రికార్డర్లు) కోసం గాలింపు కొనసాగుతోంది. దర్యాప్తుకు సహకరించేందుకు లిబియా నుంచి ప్రత్యేక బృందం కూడా టర్కీకి వెళ్లనుంది.

ఈ పర్యటనలో అల్-హద్దాద్ టర్కీ రక్షణ మంత్రి యాశర్ గులెర్‌తో పాటు ఇతర సైనికాధికారులను కలుసుకున్నారు. రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంచుకోవడంపై చర్చలు జరిగాయి. ఈ ప్రమాదం లిబియాకు తీరని నష్టమని ప్రధాని అబ్దుల్ హమీద్ పేర్కొన్నారు.

2011లో గడాఫీ పాలన అంతమైనప్పటి నుండి లిబియా దేశం రాజకీయంగా, సైనికంగా తీవ్ర గందరగోళంలో ఉంది. దేశం రెండు ముక్కలై తూర్పు, పడమర ప్రాంతాల మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో.. అల్-హద్దాద్ ఆ విడిపోయిన సైన్యాన్ని ఏకం చేయడానికి ఎంతో కృషి చేశారు. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ఆయన పోషించిన పాత్ర చాలా కీలకమైంది. అటువంటి కీలక నాయకుడు ఇప్పుడు విమాన ప్రమాదంలో మరణించడం లిబియా రాజకీయ మరియు సైనిక రంగాలకు కోలుకోలేని దెబ్బగా నిపుణులు భావిస్తున్నారు.

టర్కీలో ఘోర విమాన ప్రమాదం: లిబియా సైన్యాధిపతి సహా 8 మంది మృతి - Tholi Paluku