
ట్రంప్, షరీఫ్ భేటీపై గోప్యత దేనికి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వాషింగ్టన్‌లోని ఓవల్ ఆఫీస్‌లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్‌లతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంపై వైట్ హౌస్ నుంచి అధికారిక ఫోటోలు, వీడియోలు విడుదల చేయలేదు. దీనికి మీడియాను కూడా అనుమతించలేదు. సాధారణంగా వైట్ హౌస్ విదేశీ నాయకులతో సమావేశాలకు ఫోటోలు, లైవ్ వీడియోలు విడుదల చేస్తుంది. కానీ పాకిస్తాన్ విషయంలో భిన్నంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. అదే రోజు ట్రంప్ తుర్కీ అధ్యక్షుడు రెజెప్ తైప్ ఎర్డోగన్‌తో సమావేశమైనప్పుడు ప్రత్యక్ష ప్రసారం అందించడం గమనార్హం. షరీఫ్, మునీర్‌లతో సమావేశాన్ని పాకిస్తాన్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రమే పోస్ట్ చేశారు దీంతో పాక్ నేతలతో జరిగిన సమావేశంపై అమెరికా ఎందుకు ఇంత గోప్యత పాటిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం మంచి వాతావరణంలో జరిగిందని పాక్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేస్తుండటంతో సుమారు 30 నిమిషాలు ఆలస్యమైందని తెలిపింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ న్యూయార్క్‌లో జరిగిన రెండవ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ ఐక్యత అవసరమని పేర్కొన్నారు. "ఉగ్రవాదం స్థిరమైన అభివృద్ధికి ముప్పు కలిగించి, శాంతిని భంగపరుస్తుంది. ప్రపంచం ఉగ్రవాద కార్యకలాపాలపై సహనం చూపకూడదు. ఉగ్రవాదుల మధ్య విస్తృత నెట్‌వర్క్ ఉన్నందున, వారిని ఎదుర్కొనే దేశాలు అంతర్జాతీయ సమాజానికి ఎంతో సేవ చేసినట్లే" అని జైశంకర్ అన్నారు. దక్షిణాసియా విశ్లేషకుడు మైఖేల్ కుగెల్మన్ మాట్లాడుతూ, అమెరికా, పాకిస్తాన్ సంబంధాల పునరుద్ధరణ భారత్, అమెరికా సంబంధాల్లో తీవ్ర ఉత్కంఠగా మారిందని చెప్పారు. ఇటీవలి భౌగోళిక, రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఇది మరింత తీవ్రమైందన్నారు.
అత్యంత సున్నితమైన అంశాలపై చర్చ?
ఐరాస సమావేశాల్లో పలు దేశాల నుంచి పాకిస్తాన్‌పై ఉగ్రవాద ఆరోపణలు వస్తున్న క్రమంలో ట్రంప్ పాక్ ప్రధానితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించేందుకు సమావేశమైనట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ భేటీపై అధికారిక ఫోటోలు విడుదల చేయకుండా వైట్ హౌస్ ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడింది. అమెరికా ఇంత గోప్యత పాటిస్తుండటంతో ఈ సమావేశంలో అత్యంత సున్నితమైన అంశాలపై చర్చలు జరిగి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఉగ్రవాదం, పాక్ బడ్జెట్ కేటాయింపులు, అఫ్ఘానిస్తాన్, చైనా, భారత్‌ల గురించి ప్రస్తావన వచ్చే అవకాశముంది. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోళ్లు చేస్తున్న భారత్‌పై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక భారత్‌తో పాక్‌కు ఉన్న సరిహద్దు ఘర్షణలు, ఇటీవల ఉగ్రదాడుల గురించి తెలిసిందే. ఈ సమయంలో పాక్, అమెరికా భేటీ ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేసే అవకాశముంది. ఇది అమెరికాతో భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాణిజ్యపరంగా భారత్‌కు అమెరికా మద్దతు తగ్గుతుంది. పాక్ ఇప్పటికే సౌదీతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అమెరికా మద్దతు కూడా తోడైతే సరిహద్దులో దాడులు పెంచవచ్చు. ఈ నేపథ్యంలో భారత్ పటిష్టమైన విదేశాంగ విధానాన్ని అవలంబిస్తూ, వ్యూహాత్మకంగా వ్యవహరించి రక్షణను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
