
ట్రంప్ పై అమెరికన్ రైతుల ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలపై అమెరికన్ రైతులు ఆగ్రహంతో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ట్రంప్ వాణిజ్య వివాదాల కారణంగా అమెరికన్ రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించడంలో అమెరికన్ గ్రామీణ రైతులు కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ట్రంప్ విధానాలు తమకు ఇబ్బందిగా మారడంతో ఆగ్రహంగా ఉన్నట్టు విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.
అమెరికాలో ప్రధానంగా సోయా, మొక్కజొన్న పండించే రైతులు అధికంగా ఉంటారు. ట్రంప్ విధానాలు ఆ రైతులపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. అందుకే వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే చైనాపై విధించిన సంకాల నేపథ్యంలో అమెరికా నుంచి మొక్కజొన్న కొనుగోలు చేయడం తగ్గించింది. అది ప్రత్యక్షంగా అమెరికాలోని మొక్కజొన్న రైతులపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో భారత్ కొనుగోలు చేయాలని అమెరికా కోరుతోంది. కానీ భారత్ వద్ద సరిపడా ఉత్పత్తి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో అమెరికా రైతులు ట్రంప్ విధానాలతో విసిగిపోతున్నారు. ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోయా రైతుల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచంలోని 60 శాతం సోయాను చైనా కొంటోంది. మొక్కజొన్న తరహాలో సోయా దిగుమతిని అమెరికా నుంచి చైనా తగ్గించింది. దీంతో సోయా రైతులపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది. బ్రెజిల్ నుంచి చైనా సోయాను ఎక్కువగా కొంటోంది. అటు సోయా, ఇటు మొక్కజొన్న రైతులు ట్రంప్ వైఖరిపై మండిపడుతున్నారు. దీంతో ట్రంప్ పై ఒత్తిడి పెరుగుతోంది. 2026లో మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఇబ్బంది పడతామనే ఆందోళన రిపబ్లికన్ సభ్యుల్లో ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఉంది. స్టాగ్ ఫ్లేషన్ హెచ్చరికలున్నాయి. ఇలాంటి సందర్భంలో మళ్లీ రైతుల సమస్య గుదిబండగా మారుతుందని రిపబ్లికన్ సభ్యులు ట్రంప్ ముందు మొరపెట్టుకుంటున్నారు. దీంతో తప్పని పరిస్థితిల్లో మోడీ పట్ల ట్రంప్ ప్రేమ ఒలకబోస్తూ, వాణిజ్య చర్చలకు ముందుకు వచ్చారన్నది విశ్లేషకుల వాదన.
మొక్కజొన్న, సోయా రైతుల ఒత్తిడి నేపథ్యంలో వాటిని భారత్ కు అంటగట్టాలని అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ ఇండియా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ కొనుగోలు చేస్తే మోడీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. ఇప్పటికే పత్తి దిగుమతిపై సుంకాన్ని ఎత్తివేసి పత్తి రైతుల వెన్నువిరిచింది. ఇప్పుడు మొక్కజొన్న, సోయాను అనుమతిస్తే ఈ అంశం రాజకీయంగా మారి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సందర్భంలో అమెరికా మళ్లీ చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో పడింది. ట్రంప్, జిన్ పింగ్ ను కలిసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
