Let's talk: editor@tmv.in
ట్రంప్​ నోట.. అదే మాట

ట్రంప్​ నోట.. అదే మాట

FL - BRTH
22 సెప్టెంబర్, 2025

పెహల్గాం దాడి నేప‌థ్యంలో ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు త‌గ్గించి శాంతి నెల‌కొల్ప‌డానికి కృషి చేశాన‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి ప్ర‌కటించారు. ఏడు యుద్ధాల‌ను ఆపినందుకు త‌న‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తికి అర్హుడ‌ని పేర్కొన్నారు. శ‌నివారం అమెరికాలోని కార్న‌ర్ స్టోన్ ఇన్స్టిట్యూట్ వ్య‌వ‌స్థాప‌కుల స‌మావేశంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. మే 10న అమెరికా మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో జ‌రిగిన సుదీర్ఘ చ‌ర్చ‌ల త‌ర్వాత భార‌త్, పాక్ త‌క్ష‌ణ‌..పూర్తీ స్థాయి కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించాయ‌ని ట్రంప్ గ‌తంలో సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు 40 సార్లు ఇదే అంశాన్ని ప్ర‌స్తావించ‌న‌ట్టు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ప్ర‌పంచ వేదిక‌పై గౌర‌వించ‌బ‌డుతున్నామ‌ని ట్రంప్ ఆ స‌మావేశంలో చెప్పారు. ఇండియా, పాక్, కంబోడియా..థాయిలాండ్ మ‌ధ్య యుద్ధాలు ఆపి, శాంతి కుదిర్చి ప్ర‌పంచం గౌర‌వించే ప‌నులు చేస్తున్నామ‌ని ట్రంప్ అన్నారు. భార‌త్, పాక్ మ‌ధ్య యుద్ధాల‌ను ఎలా ఆపానో ఆలోచించాల‌ని అన్నారు. రెండు దేశాల ప‌ట్ల త‌న‌కు గౌర‌వం ఉంద‌ని పేర్కొన్నారు. గ‌తంలో తాను ఆపిన యుద్ధాలంటూ ప‌లు దేశాల పేర్ల‌ను ఈ స‌మావేశంలో ట్రంప్ ప్ర‌క‌టించారు. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న‌నేప‌థ్యంలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తో ఉన్న సంబంధాల రీత్యా యుద్ధం సుల‌భంగా ఆప‌వ‌చ్చ‌ని భావించిన‌ప్ప‌టికీ ..పుతిన్ వైఖ‌రితో నిరాశ చెందిన‌ట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు.

భార‌త్, పాక్ మ‌ధ్య కాల్పులు ఆప‌మ‌ని ఏ విదేశీ నాయ‌కుడు భార‌త‌దేశాన్ని కోర‌లేద‌ని పార్ల‌మెంట్ వేదికగా గ‌తంలో మోదీ ప్ర‌క‌టించారు. కాల్పుల విర‌మ‌ణ‌లో మూడో వ్య‌క్తి పాత్ర‌ను విదేశాంగ శాఖా మంత్రి ఎస్.జైశంక‌ర్ అప్ప‌ట్లో ఖండించారు. తాజాగా ట్రంప్ మ‌రోసారి భార‌త్,పాక్ యుద్ధం ఆపాన‌ని ప్ర‌క‌టించ‌డం, హెచ్1బి వీసా ఫీజు పెంపు పై కాంగ్రెస్ మోదీని ప్ర‌శ్నించింది. ఆదివారం సాయంత్రం జాతినుద్దేశించి మోదీ మాట్లాడే స‌మ‌యంలో ఆ విష‌యాల‌పై స్ప‌ష్ట‌త‌నివ్వాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ట్రంప్​ నోట.. అదే మాట - Tholi Paluku