
టూరిజం ప్రైవేటుకు అప్పగించాలనడం దుర్మార్గం
పర్యాటకులకు వివిధ ప్రకృతి అందాలు, ఆనందం, అహ్లాదాన్ని అందించే ఏపీ టూరిజాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏపీ టూరిజంంలోని 20 హోటల్స్ను ప్రైవేటీకరణకు నిరసనగా ఏఐటీయూసీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం విజయవాడలోని ధర్నాచౌక్లో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి రామకృష్ణ అధ్యక్షతన సభ జరిగింది.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కె రామకృష్ణ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో టూరిజం అభివృద్ధికి దోహదపడ్డాయని, చిన్నచిన్న సమస్యలు మినహా ఉద్యోగులు ప్రశాంతమైన వాతావరణంలో విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్ధితి వచ్చిందన్నారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఉద్యోగ సంఘ నాయకులను పిలిపించుకొని, సమస్యలను తెలుసుకొని ఉద్యోగులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువ గల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం టూరిజం వ్యవస్థను నిర్వీర్యం చేయడమేని స్పష్టం చేశారు. హోటల్స్ ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించడంతో ఉద్యోగులకు, కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని, ఉద్యోగ భద్రత కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. టూరిజంలో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న వందలాది ఉద్యోగులు హక్కులను హరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీఎం చంద్రబాబును కొంతమంది తప్పుదారిలో నడిపిస్తున్నారని దీంతో పలు నిర్ణయాలు ప్రజలకు, ఉద్యోగులకు ఆటంకాలుగా మారుతున్నాయన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య, టూరిజం, విశాఖ ఉక్కు, ఆర్టీసీ పలు వ్యవస్ధలను ప్రైవేట్ పరం చేసి కేవలం అమరావతి రాజధాని నిర్మించడం వలన ప్రజలకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యలపై కలిసి పోరాటం చేశామని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజావ్యతిరేక విధానాలను అవలబించడం సరికాదన్నారు. విశాఖ ఉక్కు తీసుకురావడంలో వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించారని, అటువంటి విశాఖ ఉక్కును నేడు ప్రైవేట్పరం చేస్తూంటే చంద్రబాబు మౌనంగా ఉండటాన్ని తప్పుబట్టారు. ఉద్యోగులకు, కార్మికులకు అండగా ఉంటామని వివిధ పార్టీలను, ప్రజాసంఘాలను ఏకం చేసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ టూరిజంలో భాగమైన హోటల్స్ ప్రైవేటీకరణతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగించే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, జీవో 23ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పలు రూపాల్లో జరిగే ఉద్యమాలతోనే సమస్యల పరిష్కరించుకున్నామని, ఆ స్ఫూర్తితో ఉద్యోగులందరూ ఐక్యతతో పోరాడితే ప్రభుత్వాలు దిగివచ్చి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపారు. టూరిజంలో ఉన్న ప్రైవేట్, అవుట్ స్సోరింగ్ ఉద్యోగులకు న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో సంఘం నాయకులు ప్రసాద్, రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
