Let's talk: editor@tmv.in
ట్రక్ డ్రైవర్ కిడ్నాప్: మాజీ ఐఏఎస్ ఆఫీసర్పై అనుమానం

ట్రక్ డ్రైవర్ కిడ్నాప్: మాజీ ఐఏఎస్ ఆఫీసర్పై అనుమానం

Panthagani Anusha
16 సెప్టెంబర్, 2025

రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాల మధ్య చిన్నపాటి గొడవలు జరగడం సహజమే. అలా మొదలైన ఓ గొడవ చివరికి కిడ్నాప్ కేసుగా మారింది. ట్రక్ డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ (22)ను గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లగా పోలీసులు ప్రహ్లాద్ని పూణెలోని మాజీ ఐఏఎస్ ప్రొబేషనర్ పూజ ఖేడ్కర్ నివాసంలో దొరకడం స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం, శనివారం సాయంత్రం ములుంద్, ఎయిరోలీ రోడ్డుపై ఈ సంఘటన జరిగింది. ట్రక్ డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ నడుపుతున్న వాహనం ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని స్వల్పం గా ఢీ కొట్టింది . ఈ ఘటనపై స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ట్రక్ డ్రైవర్ ప్రహ్లాద్తో వాగ్వాదానికి దిగారు.

వివాదం మధ్యే వారు కుమార్ను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించి, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తామంటూ అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు. దీంతో ట్రక్ యజమాని రవాబ్లే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి, 137(2) సెక్షన్ (అపహరణ) కింద కేసు రిజిస్టర్ చేసి విచారణ మొదలుపెట్టారు.

విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా ప్రహ్లద్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వాహనాన్ని పూణెలో గుర్తించారు. వెంటనే నవి ముంబై పోలీసులు అక్కడికి చేరుకుని, విచారణ జరిపారు. అన్వేషణలో కుమార్ పూజ ఖేడ్కర్ బంగళాలో ఉన్నట్టు బయటపడింది. అయితే, పోలీసులు ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నంలో పూజ ఖేడ్కర్ తల్లి పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించి వాగ్వాదానికి దిగారు. తరువాత పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి కుమార్ను రక్షించి నవి ముంబైకి తీసుకువచ్చారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే, పూజ ఖేడ్కర్ తల్లికి విచారణ కోసం హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. అపహరణకు కారణమైన వ్యక్తులను గుర్తించి, వారి ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.

గత కొంతకాలంగా పూజ ఖేడ్కర్ వివాదాల్లో నిలుస్తున్నారు. ఆమె 2022 సివిల్స్ పరీక్షలో (ఒబిసి) దివ్యాంగుల కోటా కింద తప్పుడు సమాచారంతో లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను పూజ ఖండించి నప్పటికీ, (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ పోలీసులు సైతం ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు పోలీసులు ప్రహ్లద్ని కిడ్నాప్ చేసిన ఉ ఇద్దరిని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ట్రక్ డ్రైవర్ కిడ్నాప్: మాజీ ఐఏఎస్ ఆఫీసర్పై అనుమానం - Tholi Paluku