
టమాటా రైతులు చిత్తు చిత్తు
టమాటా రైతుల కళ్ళలో నీళ్లొస్తున్నాయి.. పెట్టుబడులు చూస్తే లక్షల్లో ఉంటున్నాయి.. పంట పండినాక అమ్ముదాం అంటే ధర కిలో రూపాయి పలుకుతోంది.. ఇక ఈ సేద్యం ఎందుకురా దేవుడా అని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. బయట మార్కెట్లో ధర బాగానే పలుకుతోంది.. కిలో ముప్పై.. నలభై అమ్ముతున్నా హోల్ సేల్ మార్కెట్లో మాత్రం ధర ఘోరంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టాలపాలవుతున్నారు. తాజాగా కర్నూలు హోల్సేల్ మార్కెట్లో కేజీ టమోటా అర్ధరూపాయి.. లేదా రూపాయి మధ్య అమ్ముడవుతోంది.
దీంతో టమోటా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి బాగుంది.. పైగా ఎక్కువమంది రైతులు పంట వేయడంతో ఉత్పత్తి పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చింది. దీంతో.. ధరలు భారీగా పడిపోయాయి. దీంతో వ్యాపారులు సైతం టమోటా పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామాల నుంచి కర్నూలుకు తీసుకొచ్చిన టమోటా రవాణాకు అయ్యే రవాణా ఖర్చులు కూడా చేతికి రావడం లేదని అంటున్నారు. దీనికి తోడు వ్యాపారులు చెబుతున్న ధరలతో అవమానానికి గురవుతున్న రైతులు టమాటాను మార్కెట్లో పారబోసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పంటను కొనుగోలు చేసి బయటి జిల్లాలకు ఎగుమతి చేస్తే తమకు కొంతవరకైనా నష్టాలు తగ్గేదని రైతులు అంటున్నారు.
